ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. శనివారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగిలిన జిల్లాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక ఆదివారం రోజున కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలులు, ఉరుములు వచ్చేటప్పుడు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని ప్రజలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది. రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
మరోవైపు దక్షిణ కోస్తాలో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే కోస్తాంధ్ర నుంచి మహారాష్ట్ర వరకూ ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
మరోవైపు తెలంగాణలోనూ జూన్ నెలాఖరు వరకూ వానలు పడనున్నాయి. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాల ప్రభావంతో వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ తెలంగాణలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
