ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పలు జిల్లాలలో వర్షం కురవనుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మేఘావృతమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు. మరోవైపు గురువారం వరకూ ఏపీలో మేఘావృత వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు ఎల్ నినో ప్రభావంతో ఈసారి తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం సందర్భంగా రైతులకు నిరంతర సాంకేతిక సలహాలు అందిస్తూ, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. అలాగే తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్‌ను విస్తృతంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. మేత పంటలకు రక్షిత సాగునీరు కల్పించాలని, పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
ప్రతి మండలంలో కనీసం ఒక పశు శిబిరమైనా ఏర్పాటు చేయాలని, ఆ శిబిరం ద్వారా పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సీఎస్ సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో చర్యల అమలుపై నిరంతర సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే రైతులు, పశుపోషకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇక ఎల్ నినో కారణంగా జులై నెలలో ఏపీలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
