Ram Gopal Varma : ప్రముఖ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు మరోసారి చుక్కెదురైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ముందస్తు బెయిల్ కావాలంటూ రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు నవంబరు 27కు వాయిదా వేసింది. ఆర్జీవీ వ్యాఖ్యలను తప్పుపడుతూ పలువురు టీడీపీ, జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు, గుంటూరు , విశాఖపట్నం జిల్లాలలో రాంగోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియా వేదికగా తమ పార్టీ అగ్రనేతలపై ఆర్జీవీ నోరు పారేసుకున్నారని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆరోపించారు.
Also Read :National Milk Day : వామ్మో.. పాలలో అవన్నీ కలుపుతున్నారా.. దడ పుట్టిస్తున్న కల్తీ
ప్రస్తుతం ఆర్జీవీ కోసం ఏపీ పోలీసు బృందాలు హైదరాబాద్‌తో పాటు తమిళనాడులో గాలిస్తున్నాయి. ఈ నెల 23న కోయంబత్తూరులో షూటింగ్‌లో ఆర్జీవీ పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి నటులతో వర్మ దిగిన కొన్ని ఫొటోలు ‘ఎక్స్’లో కనిపించాయి. దీంతో ఏపీ పోలీసుల ఒక టీమ్ కోయంబత్తూరుకు వెళ్లింది. మరో పోలీసు టీమ్ ముంబైకి వెళ్లింది. ఆర్జీవీ లీగల్ టీమ్ మాత్రం వర్మ వర్చువల్‌గా పోలీసు విచారణకు హాజరవుతారని చెబుతోంది. వాస్తవానికి ఈ నెల 19న ఒంగోలు గ్రామీణ పోలీసు సర్కిల్ కార్యాలయంలో విచారణకు రాంగోపాల్ వర్మ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరుకాలేదు. దీంతో నవంబరు 25న తన ఎదుట హాజరు కావాలని పోలీసు విచారణ అధికారి ఇంకోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే హైకోర్టులో మరోసారి ఆర్జీవీ(Ram Gopal Varma) బెయిల్ పిటిషన్ వేశారు. అయితే సోమవారం రోజు ఒంగోలు పోలీసులు నేరుగా హైదరాబాద్‌లోని రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంట్లో లేరని పోలీసులకు తెలిసింది. ఆయనకు పోలీసులు ఫోన్ కాల్ చేస్తే.. స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో ఆర్జీవీ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.