GVMC Mayor Election : గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత మేయర్, వైసీపీ నాయకురాలు గొలగాని హరివెంకటకుమారిపై ఈనెల 19న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గింది. అయితే, తాజాగా.. కొత్త మేయర్ ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 28వ తేదీన ఉదయం 11గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.
వైసీపీ మేయర్ హరి వెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి కార్పొరేటర్లు నెగ్గారు. అవిశ్వాస తీర్మానం కోసం ఈనెల 19న జీవీఎంసీ ప్రత్యేకంగా సమావేశం అయింది. 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. హెడ్ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకుని ఓటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఓటింగ్‌లో 74 మంది సభ్యులు హాజరుకావడంతో కూటమి అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 63 మంది కార్పొరేటర్లు, 11 మందిఎక్స్ అఫీషియల్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Also Read: TTD: సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరనే చర్చ జరుగుతుంది. అయితే, మేయర్ గా టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. 96వ వార్డు కార్పొరేటర్ అయిన శ్రీనివాసరావును మేయర్ గా ఎన్నుకోవాలని కూటమి కార్పొరేటర్లతోపాటు నేతలు కూడా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేసినట్లు తెలిసింది. దీంతో పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనం కానుంది.
మరోవైపు.. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై కూడా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఈనెల 26న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి హరేంధిరప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈలోగానే జియ్యాని శ్రీధర్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. శ్రీధర్ రాజీనామాతో ఖాళీ అయ్యే డిప్యూటీ మేయర్ పోస్టు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ పై అవిశ్వాసం సందర్భంగా యాదవ మహిళను పదవి నుంచి దించేస్తున్నారని వైసీపీ నాయకులు గట్టిగా ప్రచారం చేశారు. దీంతో ఉపమేయర్ పదవిని ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది.