AP Liquor Scam : వైఎస్సార్ సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ లిక్కర్ స్కాం జరిగిందనే అభియోగాలు ఉన్నాయి. ఈ స్కాంలోని కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతడిని కర్ణాటకలోని మైసూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు. పక్కా సమాచారంతో గోవిందప్ప బాలాజీపై సిట్ అధికారులు నిఘా పెట్టి మరీ అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది.
గోవిందప్ప బాలాజీ ఎవరు ? ఏం చేశారు ?
గోవిందప్ప బాలాజీ వైఎస్ జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్(AP Liquor Scam)లో పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన చిత్తూరు జిల్లా పలమనేరు వాస్తవ్యులు. జగన్ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతీ సిమెంట్స్‌లో.. గోవిందప్ప బాలాజీ 2010 ఏప్రిల్ 30 నుంచి పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ కార్యకలాపాల బాధ్యతలన్నీ ఆయనే చూస్తారు. వైఎస్సార్ సీపీ పాలనా కాలంలో పెద్దసంఖ్యలో మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన కంపెనీలు, డిస్టిల్లరీల నుంచి ప్రతినెలా వసూలు చేసిన రూ.60 కోట్ల ముడుపులను రాజ్ కసిరెడ్డి తీసుకెళ్లి గోవిందప్ప బాలాజీకి, వైఎస్ జగన్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డికి ఇచ్చేవారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ ముడుపుల సొమ్మును గోవిందప్ప బాలాజీ, కృష్ణ మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఎవరికి ఇచ్చేవారు ? అనేది గుర్తించడంపై సిట్ అధికారులు ప్రధాన ఫోకస్ పెట్టారు.
Also Read :Terrorists Encounter : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే ఉగ్రవాది హతం.. మరో ముగ్గురి కోసం వేట
మద్యం ముడుపుల డబ్బులను ఏం చేశారు ?
కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఇద్దరూ వైఎస్ జగన్, వైఎస్ భారతిలకు నమ్మినబంట్లు. కృష్ణమోహన్‌రెడ్డి నిరంతరం జగన్ వెంటే ఉండేవారు. వైఎస్ భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలను గోవిందప్ప బాలాజీయే చక్కబెట్టే వారట. గోవిందప్ప బాలాజీ ఒక సీఏ. ఆయన చేతుల మీదుగానే మద్యం ముడుపుల డబ్బులు వివిధ మార్గాల్లోకి మళ్లి ఉండొచ్చని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం ముడుపుల డబ్బులను ఏం చేశారు ? వాటిని ఏయే కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు ? ఏయే రూపంలో విదేశాలకు తరలించారు ? అనే కోణంలో ప్రస్తుతం సిట్ దర్యాప్తు సాగుతోంది. ప్రముఖ మద్యం బ్రాండ్లను అణగదొక్కటం, ముడుపులిచ్చిన కంపెనీల బ్రాండ్లను ప్రోత్సహించటం తద్వారా రూ.3,200 కోట్ల మేర ముడుపులను వసూలు చేయటంలో రాజ్ కసిరెడ్డితోపాటు గోవిందప్ప బాలాజీ కీలక పాత్ర పోషించారని సిట్ తేల్చింది.