CM Chandrababu: పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం సభ్యులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై సచివాలయం మొదటి బ్లాక్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఫొటో ఎగ్జిబిషన్‌లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు.
Read Also: Gachibowli Land Case : అనుమతులు లేకుండా చెట్లు కొట్టినట్లు తేలితే జైలుకే : సుప్రీంకోర్టు
గత ఐదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అదనపు సాయం చేయాలని.. దానికి అనుగుణంగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయంపై సీఎం ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలతల గురించి చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను మరోసారి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
కాగా, ఈ ఫైనాన్స్ కమిషన్ బృందం రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ వరకు పర్యటించనుంది. విజయవాడ , తిరుపతి నగరాల్లో పర్యటించనుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఫైనాన్స్ కమిషన్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు , ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ కానున్నారు. ఇక, గురువారం మధ్యాహ్నం రెండున్నరకు స్థానిక ప్రజాప్రతినిధులతో 16వ ఆర్థిక సంఘం సభ్యులు సమావేశం అవుతారు. అనంతరం వాణిజ్య, వ్యాపారవర్గాలతో తిరుపతిలో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి ఈ నెల 18వ తేదీ (శుక్రవారం) తెల్లవారుజామున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఈ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళుతుంది.