Pension 3000 : అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు ఏపీ సర్కారు ఇవాళ తీపికబురు వినిపించనుంది. వీరికి ప్రస్తుతం ప్రతినెలా ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కు(Pension 3000) పెంచబోతున్నారు. ఈమేరకు ప్రతిపాదనలతో కూడిన ఫైలు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం ముందుకు రాబోతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ ఫైలుకు ఆమోదం లభిస్తుందని తెలుస్తోంది. 2024 జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.3,000కు పెంచనున్నట్లు గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800 కోట్లకు పైగా ఖర్చుచేస్తుండగా.. జనవరి నుంచి జరిగే పింఛను పెంపుతో ఆ ఖర్చు రూ.2,000 కోట్లు దాటే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,33,781 మంది పింఛన్లు పొందారు.
We’re now on WhatsApp. Click to Join.
పొదుపు మహిళలకు మంచినీటి కుళాయి ఏర్పాటు పనులు..
గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలను ఏర్పాటుచేసే కీలక కార్యక్రమాన్ని ఏపీ సర్కారు అమలు చేస్తోంది. ఇప్పటిదాకా కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ పనులను ఇకపై ఆయా గ్రామాల్లోని పొదుపు సంఘాల మహిళలతో కూడిన గ్రామ జలసంఘం కమిటీలకే అప్పగించాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రక్రియలో మహిళా కమిటీలపై ఆర్థిక భారంపడే అవకాశం లేకుండా.. ఈ పనులకు అవసరమైన పైపులైన్లు, కుళాయి సామాగ్రిని ప్రభుత్వమే ముందుగా ఆ కమిటీలకు ఇచ్చే అవకాశం ఉంది. మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలపైనా క్యాబినెట్ భేటీలో చర్చిస్తారు.