Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

అమరావతిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని, ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణలో […]

Published By: HashtagU Telugu Desk
Amaravati Farmers

Amaravati Farmers

అమరావతిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని, ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతులకు ఇచ్చే వార్షిక కౌలును పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు రెండో విడత భూసమీకరణ చేస్తున్న తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన రైతులతో సమావేశమయ్యారు. రైతులతో అర్ధరాత్రి వరకు సమావేశం కొనసాగగా, అమరావతి కోసం భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని సీఎం హామీ ఇచ్చారు. వార్షిక కౌలు పెంచేందుకు అంగీకరించారు.

రాజధాని రెండో విడత భూసమీకరణలో రైతులకు ఏడాదికి వార్షిక కౌలు ఎకరానికి రూ.30 వేలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు రూ.40 వేలకు పెంచారు. పదేళ్ల పాటూ చెల్లిస్తామని తెలిపారు. అంతేకాదు, వార్షిక కౌలు ప్రతి ఏటా రూ.3వేల చొప్పున పెంచుతామన్నారు. అంతేకాదు, ఒక్కో రైతుకు రూ.లక్షన్నర వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు అంగీకరించారు. రెండో విడత భూ సమీకరణకు సహకరించాలని చంద్రబాబు రైతుల్ని కోరారు. కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందని, అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు.

అమరావతి భూముల్లో ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తాను తీసుకున్నానని, రైతులే బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాలన్నారు చంద్రబాబు. రైతులంతా భూ సమీకరణను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్‌ కూడా ప్రపంచస్థాయి నగరంలా మారిందని, గతంలో రూ.లక్షల్లో ఉన్న భూముల విలువ ఇప్పుడు రూ.కోట్లకు పెరిగిందన్నారు. అమరావతి కూడా అంతకుమించి అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చట్టబద్ధత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

అంతకముందు రాజధాని ప్రాంతానికి చెందిన 70 మంది రైతులు చంద్రబాబుతో సమావేశంలో పాల్గొన్నారు. కౌలు పెంపు, రుణమాఫీ వంటి అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచారు. వారి డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుంచారు. అనంతరం సీఎం మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌లతో విడివిడిగా మాట్లాడారు. ఆ తర్వాత వార్షిక కౌలు పెంపు, రుణమాఫీపై ప్రకటన చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చిన రైతుల్లో కర్లపూడి వారు మాత్రం తమకు అభివృద్ధి చేసిన స్థలాల్ని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు లోపల ఇవ్వాలని కోరారు. మరో నాలుగు గ్రామాల ప్రజలు తమకు ఒకేచోట స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి హామీ ఇవ్వలేదు. మొత్తం మీద అమరావతి రైతులకు ఊరట దక్కింది. వార్షిక కౌలు పెంచడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. తాము కోరిన విధంగా కౌలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

 

  Last Updated: 18 Apr 2026, 10:29 AM IST