వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. తన ఇల్లు, కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా, నిందితులను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో అంబటి నేడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై నిప్పులు చెరిగారు. “చంద్రబాబును దూషించాననే సాకుతో నన్ను అరెస్ట్ చేసి 18 రోజులు జైల్లో ఉంచారు.. మరి నా ఇంటిపై దాడి చేసి కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా లోపల వేశారా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దాడి అంతా పోలీసుల కళ్లముందే జరిగిందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ దాడి వెనుక నారా లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ల హస్తం ఉందని అంబటి ఆరోపించారు. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారని విమర్శించారు. తనను అరెస్ట్ చేసిన సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ‘కస్టోడియల్ టార్చర్’కు గురిచేసే ప్రయత్నం జరిగిందని, ఆ గాయాలు ఇంకా మానలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “నన్ను భయపెట్టాలనుకోవడం మీ పొరపాటే.. ప్రాణాలకు తెగించైనా న్యాయపోరాటం చేస్తాను. ఎవరినీ వదిలిపెట్టను” అని హెచ్చరించారు. ఈ దీక్షకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైసీపీ నేతలు నూరి ఫాతిమా, డైమండ్ బాబు తదితరులు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు.
