ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల (MGNREGA Workers) కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కరవు మండలాల్లో ఉపాధి పని దినాలను 150 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 100 పని దినాలను వినియోగించుకున్న కుటుంబాలు మార్చి నెలాఖరులోగా మిగిలిన 50 అదనపు రోజులను ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త నిర్ణయం వెంటనే అమల్లోకి రానుండగా, అదనపు పని దినాల వివరాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Team India Jersey: టీమిండియా జెర్సీపై పాక్ పేరు.. అభిమానులు తీవ్ర ఆగ్రహం
ఖరీఫ్-2024లో కరవు ప్రభావిత చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లోని 54 మండలాల్లో ఉపాధి హామీ పనులను పొడిగించేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వెంటనే కేంద్రం ఆమోదం తెలుపడంతో 50 అదనపు పని దినాలు మంజూరు చేశారు. సాధారణంగా జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 పని దినాలు కల్పిస్తారు. అయితే కరవు మండలాల్లో మరో 50 పని దినాలు అదనంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, కేంద్రం దానిని అంగీకరించింది. గత ఐదేళ్లలో ఈ విధంగా అదనపు పనిదినాలు కల్పించడం ఇదే తొలిసారి.
ఏపీ ప్రభుత్వం రేషన్ డీలర్ల కమీషన్, నిత్యావసరాల రవాణా కోసం రూ. 210.44 కోట్లను మంజూరు చేసింది. పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి సౌరభ్ గౌర్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు. అలాగే ప్రజా గ్రంథాలయాల శాఖ డైరెక్టర్‌గా కృష్ణమోహన్ నియమితులయ్యారు. గతంలో బీసీ సంక్షేమ శాఖలో అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఆయన, డిప్యుటేషన్‌పై పాఠశాల విద్యాశాఖకు బదిలీ అయ్యారు. అలాగే ఏపీ ప్రభుత్వం 21వ విడత ఎర్రచందనం వేలానికి సిద్ధమైంది. మొత్తం 905.671 టన్నుల ఎర్రచందనం విక్రయించేందుకు గ్లోబల్ ఈ-టెండర్లను పిలిచింది. ఈ వేలం ఫిబ్రవరి 28న తొలి దశ, మార్చి 6న రెండో దశ, మార్చి 13న మూడో దశ నిర్వహించనున్నారు. ఈ వేలం ప్రక్రియను పర్యవేక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు.