ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందబోతోంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిధుల లభ్యతను బట్టి ఉద్యోగులకు వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా కసరత్తు చేపట్టారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ దగ్గర నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరిపేలా మంత్రి పయ్యావుల కసరత్తు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను నిధుల లభ్యతను బట్టి విడతల వారీగా విడుదల చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పోలీసులకు అదనపు సరెండర్ లీవుల వంటి వాటికి సంబంధించిన బకాయిలు ఉన్నాయి.
ఆర్టీసీ ఉద్యోగుల ఈపీఎఫ్‌వోపై అభ్యర్థన
మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్‌వో సమస్యలను పరిష్కరించాలని ఎన్‌ఎంయూఏ (నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్) లేఖ ద్వారా ఆర్టీసీ ఎండీని కోరింది. ఉద్యోగులు హయ్యర్ పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో కొందరికి డిమాండ్ నోటీసులు రాలేదన్నారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి హయ్యర్ పింఛను వచ్చేలా చూడాలని కోరింది. కొంతమందికి
ఆన్‌లైన్‌లో వచ్చిన డిమాండ్ నోటీసుల గురించి తెలియలేదని.. అందుకే డబ్బులు చెల్లించలేకపోయారన్నారు. అలాంటి ఉద్యోగులకు మరోసారి డబ్బులు కట్టేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఉద్యోగి నుంచి 58 ఏళ్ల వరకే పింఛన్ కంట్రిబ్యూషన్ రికవరీ చేయాలని.. కానీ 8 వేల మందికి పైగా ఉద్యోగులకు మొత్తం రూ.32.88 కోట్లు రికవరీ చేసి ఈపీఎఫ్‌వోకి పంపారన్నారు. వీటిని ఉద్యోగులకు తిరిగి చెల్లించాలని ఎన్ఎంయూఏ కోరింది.
ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఫోరం రిక్వెస్ట్
ఏపీలో ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా పరిపాలన ట్రైబ్యునల్‌ను తిరిగి పునరుద్ధరించాలని
రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫోరం కోరింది. ఈ ట్రైబ్యునల్‌ను 2022లో రద్దు చేశారని, దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రైబ్యునల్ ద్వారా సీనియారిటీ, ప్రమోషన్లు, బదిలీలు సహా ఇతర అంశాలను ట్రైబ్యునల్ త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే ట్రైబ్యునల్‌ను పునరుద్ధరించాలని ఫోరం కోరింది.
