Pawan Kalyan: జ‌న‌సేన‌పై “విలీనం” నీడ

జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి `విలీనం` నీడ‌ వెంటాడుతోంది. దానికి బ‌లం చేకూరేలా పార్టీ సిద్ధాంత క‌ర్త‌లుగా చెప్పుకుంటున్న వాళ్లు కొంద‌రు పార్టీని వీడారు. ఆ స‌మ‌యంలో వాళ్లు చేసిన వ్యాఖ్య‌లతో పాటుగా జ‌‌న‌సేనాని ప‌వ‌న్ ఒకానొక స‌మ‌యంలో విలీనం గురించి ప్ర‌స్తావించాడు.

  • Written By:
  • Updated On - November 7, 2021 / 12:20 AM IST

జ‌న‌సేన పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి `విలీనం` నీడ‌ వెంటాడుతోంది. దానికి బ‌లం చేకూరేలా పార్టీ సిద్ధాంత క‌ర్త‌లుగా చెప్పుకుంటున్న వాళ్లు కొంద‌రు పార్టీని వీడారు. ఆ స‌మ‌యంలో వాళ్లు చేసిన వ్యాఖ్య‌లతో పాటుగా జ‌‌న‌సేనాని ప‌వ‌న్ ఒకానొక స‌మ‌యంలో విలీనం గురించి ప్ర‌స్తావించాడు. జాతీయ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్ద‌లు విలీనం కోసం ఒత్తిడి తెస్తున్నార‌ని స్వ‌యంగా ప‌వన్ చెప్పాడు. రెండేళ్ల క్రితం తాడేప‌ల్లిలో జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ స‌మావేశంలో ఆయ‌న ఆ సంకేతం ఇచ్చాడు. ఆ త‌రువాత బీజేపీతో పొత్తు పెట్టుకుని లెఫ్ట్ భావ‌జాలం నుంచి రైట్ కు మ‌ళ్లాడు. ఇప్పుడు రైట్ భావ‌జాలం కూడా ఆయ‌న‌కు ఇబ్బంది క‌రంగా ఉంది. అందుకే, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పొత్తు ఉంటుంద‌ని తాజాగా ప‌వ‌ర్ స్టార్ అంటున్నాడు. అంటే, బీజేపీ కాకుండా ఇత‌ర పార్టీల‌తో జ‌త క‌ట్ట‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని సంకేతం ఇచ్చేశాడు.

 

Also Read : టీడీపీ, బీజేపీ పొత్తుపై అంత‌ర్గ‌త యుద్ధం

ప్ర‌జారాజ్యం పార్టీకి చెందిన యువ‌రాజ్యం అధ్య‌క్షుడుగా ప‌వ‌న్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. ఆనాడు ఆయ‌‌న చేసిన దూకుడు ప్ర‌సంగాలు స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి వాళ్ల‌కు గట్టిగా త‌గిలాయి. మెగా హీరోలు అంద‌రూ 2009 ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. అయిన‌ప్ప‌టికీ 18 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోవ‌డం వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. ఆ త‌రువాత రెండేళ్ల పాటు పార్టీని న‌డ‌పారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జారాజ్యాన్ని విలీనం చేయ‌డంతో మెగా హీరోల రాజ‌కీయం అభిమానుల‌కు అంత‌బ‌ట్ట‌లేదు. ఆనాటి నుంచి ప‌వ‌న్ మాత్రం స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై క‌సిని పెంచుకున్నాడ‌ని అనుచ‌రులు చెప్పుకుంటుంటారు.ఉమ్మ‌డి రాష్ట్రంలోని ప‌రిస్థితులను గ‌మ‌నించిన ప‌వ‌న్ 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా జ‌న‌సేన పార్టీని స్థాపించాడు. ఆనాటి నుంచి 2019 సాధార‌ణ ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు దూరంగా జ‌న‌సేన ఉంది. రాష్ట్రాలు విడిపోయిన త‌రువాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ ల‌కు ప‌వ‌న్ మ‌ద్ధ‌తు ఇచ్చాడు. ఆ రోజుకు ప‌వ‌న్ మిన‌హా పార్టీకి ఒక రూపం లేదు. క్ర‌మంగా పార్టీని విస్త‌రింప చేస్తూ 2019 ఎన్నిక‌ల్లో బీఎస్పీ, క‌మ్యూనిస్ట్ పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి తొలిసారిగా జ‌న‌సేన దిగింది. రెండు చోట్ల పోటీ చేసిన ప‌వ‌న్ ఓడిపోగా, పార్టీ త‌ర‌పున రాపాక వ‌ర ప్ర‌సాద్ గెలుపొందాడు. ఆయ‌న కూడా జ‌న‌సేన‌కు దూరంగా ఉంటూ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నాడు.

 

Also Read : ఒకే వేదికపై కేసీఆర్, జగన్

ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొన్ని రోజుల త‌రువాత నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకున్నాడు. హిందువుల‌కు అండ‌గా ఉండ‌డానికి పొత్తు అంటూ నిన‌దించాడు. అదే స‌మ‌యంలో విలీనం చేయాల‌ని జాతీయ పార్టీకి చెందిన పెద్ద‌లు ఒత్తిడి తెస్తున్నార‌ని సంకేతం ఇచ్చాడు. ప్ర‌జారాజ్యం త‌ర‌హాలోనే ప‌వ‌న్ కూడా విలీనం చేస్తాడ‌ని పెద్ద ఎత్తున ఆనాడు ప్రచారం జ‌రిగింది. దానికి చెక్ పెడుతూనే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాడేందుకు బీజేపీతో క‌లిసి ప‌వ‌న్ న‌డిచాడు. తొలి ఏడాదిలో చాలా వ‌ర‌కు మౌనంగా ఉన్న ప‌వ‌న్‌, రెండో ఏడాది నుంచి అడ‌పాద‌డ‌పా బీజేపీతో క‌లిసి కొన్ని కార్య‌క్ర‌మాల‌ను చేశాడు. తిరుప‌తి ఉప ఎన్నిక నుంచి ఆ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న భేదాభిప్రాయాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.తొలుత జ‌న‌సేన తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావించింది. ఆ మేర‌కు మీడియాకు లీకులు ఇచ్చారు. ఆ త‌రువాత ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవ‌ధ‌ర్ త‌మ అభ్య‌ర్థిని పోటీలో నిలుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీని కాద‌ని టీఆర్ఎస్ పార్టీకి జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇచ్చింది. తెలంగాణ‌లో ప‌వ‌న్ ఎంట్రీని బీజేపీ స‌సేమిరా అంగీక‌రించ‌డంలేదు. ఏపీలోనూ బీజేపీ, జ‌న‌సేన వేర్వేరుగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నాయి మిన‌హా ఒక వేదిక‌పైకి రాలేక‌పోతున్నాయి.

Also Read : TDP vs YCP : నాయుడి కంచుకోటను వైసీపీ బద్దలుకొడుతుందా..?

తాజాగా బ‌ద్వేల్ ఉప ఎన్నిక విష‌యంలోనూ రెండు పార్టీల మ‌ధ్య అగాధం ఏర్ప‌డింది. ప్ర‌చారానికి ప‌వ‌న్ దూరంగా ఉన్నాడు. ఇటీవ‌ల చేసిన శ్ర‌మ‌దానం, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేక స‌భల్లో ఎక్క‌డా బీజేపీ క‌నిపించ‌లేదు. దీంతో ప‌వ‌న్ బీజేపీకి క‌టీఫ్ చెబుతున్నాడని బ‌ల‌మైన టాక్ వినిపిస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం పొత్తు ఎవ‌రితోనైనా పెట్టుకుంటామ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం స‌రికొత్త ప్ర‌చారానికి దారితీస్తోంది. ప్రాంతీయ పార్టీల కార‌ణంగా జాతీయ‌వాదం, అభివృద్ధి కుంటుప‌డుతుంద‌ని బీజేపీ భావ‌న‌. దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల‌పై మెరుపుదాడుల‌ను చేస్తోంది. ఆ క్ర‌మంలో జ‌న‌సేన మీద విలీనం క‌త్తిని బీజేపీ పెట్టింద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని వినికిడి. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌ను బేరీజు వేసుకుంటోన్న బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు మిత్రునిగా ఉన్న ప‌వ‌న్‌ను సొంతం చేసుకోవాల‌ని భావిస్తోంద‌ట‌. అందుకే, తాజాగా ప‌వ‌న్‌, సోమువీర్రాజు మ‌ధ్య కీల‌క భేటీ జ‌రిగిందని ఆ రెండు పార్టీల వాల‌కాన్ని గ‌మ‌నిస్తున్న వాళ్ల అభిప్రాయం.ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిన‌ప్ప‌టికీ చిరంజీవి, కిర‌ణ్ కుమార్ రెడ్డి. ప‌ల్లంరాజు, ర‌ఘువీరారెడ్డి, శైల‌జానాథ్, కేవీపీ రామ‌చంద్రరావు, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, చింతామోహ‌న్ త‌దిత‌ర రాజ‌కీయ ఉద్ధండులు ఆ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి ప‌వ‌ర్ స్టార్ లాంటి లీడ‌ర్ కావాల‌ని భావిస్తోంది. అందుకే, జ‌న‌సేన విలీనం కోసం ఢిల్లీ కాంగ్రెస్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని తాజాగా ఆ పార్టీలోని కొన్ని వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వంతో పాటు స్వేచ్ఛ‌గా పార్టీని న‌డిపే అవ‌కాశం ఇస్తామ‌ని చెబుతున్నార‌ట‌. కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే కీల‌క ప‌ద‌వుల‌ను ఇస్తామ‌ని ఆశ చూపుతున్నార‌ని టాక్‌. ఇలా..జాతీయ పార్టీలు విలీనం కోసం జ‌నసేన మీద క‌న్నేసిన‌ట్టు సీరియ‌స్ చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. మ‌రో 25 ఏళ్ల పాటు జ‌న‌సేన ఉంటుంద‌ని తాజాగా ప‌వ‌న్ చెబుతున్నాడు. విలీనం ప్ర‌స‌క్తే లేద‌ని ప‌లు మార్లు ఆయ‌న క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ, ఒత్తిడి మాత్రం ఉంద‌ని ఎప్పుడో చెప్పాడు. కానీ, రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌డానికి అవకాశం ఉంద‌ని గ‌త చ‌రిత్ర చెబుతోంది. సో…విలీనం నీడ ఎక్క‌డ ఆగుతుందో చూద్దాం.