ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరంలో వైసీపీకి అభ్యర్థులు కరువైయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ .. వైసీపీలోకి వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధిష్టానం గన్నవరం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన స్థానంలో కొత్త వారిని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం దుట్టా సీతారామలక్ష్మీని సమన్వయకర్తగా నియమించారు. అయితే ఆమెను కూడా మార్చి వేరే వారిని అభ్యర్థిగా నిలపాలని వైసీపీ చూస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావును పార్టీలోకి ఆహ్వానించి గన్నవరం టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైంది. నూజివీడులో టీడీపీ అభ్యర్థిగా కొలుసు పార్థసారథి పోటీ చేస్తుండటంతో ముద్దరబోయిన అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీ నేతలు ముద్దరబోయినకు గాలం వేశారు. గన్నవరం టికెట్ ఇస్తామంటూ ఆయనతో టచ్‌లోకి వెళ్లారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గతంలో గన్నవరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఇక్కడ ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే భావనతో వైసీపీ ఆయన్ని బరిలోకి దించబోతుంది. గన్నవరం నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో ముద్దరబోయినకు కలిసి వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సీఎంవో కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డిలను కలిసినట్లు సమాచారం.టికెట్‌పై ఆయనకు స్పష్టత ఇచ్చారని.. త్వరలోనే ఆయన వైసీపీలో చేరి గన్నవరంలో ప్రచారం ప్రారంభిస్తారని ముద్దరబోయిన సన్నిహితులు తెలిపారు. ఇదే సీటు కోసం ఎప్పటి నుంచో చూస్తున్న దుట్టా రామచంద్రరావు ఫ్యామిలీకి మరోసారి నిరాశే మిగిలేలా కనిపిస్తుంది. 2019లో దుట్టా రామచంద్రారావు స్థానంలో యార్లగడ్డ వెంకట్రావు వచ్చి పోటీ చేసి ఓడిపోయారు. అయితే వీరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోరాడారు. చివరికి యార్లగడ్డ టీడీపీలో చేరడం, వంశీకి వైసీపీలో టికెట్ నిరాకరించడంతో దుట్టా ఫ్యామిలీకి లైన్ క్లియర్ అయింది. దుట్టా సీతారామలక్ష్మీని సమన్వయకర్తగా నియమించారు. అయితే ఇంతలోనే ముద్దరబోయిన వైసీపీలో చేరేందుకు రెఢీ అవ్వడంతో గన్నవరంలో దుట్టా ఫ్యామిలీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది.దీంతో దుట్టా ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
Also Read: Balka Suman: 15 రోజుల్లో నలుగురు గురుకుల విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకున్నారు: బాల్క సుమన్