ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ (Free Gas Cylinders Scheme) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ పథకానికి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ ఉన్న వారు అర్హులు. రేషన్ కార్డుకు E-KYC తప్పనిసరి. లేదంటే గ్యాస్ ఏజెన్సీల వద్ద లింక్ చేసుకోవాలి. Adhar-Bank ఖాతా లింక్ అయ్యి ఉండాలి. అలా లింకైన ఖాతాలోనే సిలిండర్ కోసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 48 గంటల్లోగా జమ అవుతాయి. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందించనున్నారు.
శ్రీకాకుళం (D) ఈదుపురంలో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు (CHandrababu) శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు (D) ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేస్తారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ప్రభుత్వం రూ.2,685 కోట్ల సబ్సిడీ అందిస్తోంది. అయితే ఇదంతా ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటున్నట్లు ఉందని వైసీపీ (YCP) ఆరోపిస్తోంది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో నేటి నుంచి ప్రజలపై రూ. 17,072 కోట్లు భారం మోపుతున్నారంటోంది. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నామంటూ 20 సిలిండర్ల డబ్బుల్ని సర్కార్ వసూలు చేస్తోందని వైసీపీ విమర్శలకు దిగింది.
చంద్రబాబు, పవన్ దీపావళి బాదుడు మామూలుగా లేదు.. వీరబాదుడు అంటూ వైసీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుందని చెప్పుకొచ్చారు. సబ్సిడీ మీద మూడు సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు. మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ చార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం 17,072 కోట్లు. సూపర్ సిక్స్‌లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం 14,378 కోట్లు. ఎలాగంటే..(విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం 17,072 కోట్లు-రూ.2685కోట్లు=14,378 కోట్లు)
రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు కోటి యాభై లక్షలు. కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాలలోపు మాత్రమే.. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని మహేష్ డిమాండ్ చేసారు.
Read Also : AP Formation Day : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి తెలుసా..?