Site icon HashtagU Telugu

Free Bus : ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ – రూల్స్ చూసుకోండి

Free Bus Scheme In Ap

Free Bus Scheme In Ap

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మరో భారీ పథకం అమలుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని (Free Bus) ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఈ పథకం క్రమబద్ధంగా అమలు కావాలని, ప్రయోజనాన్ని స్పష్టంగా చూపించాల్సిన అవసరం ఉందని ఆయన అధికారులకు సూచించారు. ఇందుకోసం ‘జీరో ఫేర్ టిక్కెట్’ (Zero Fare Ticket) అనే ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

జీరో ఫేర్ టిక్కెట్‌లో ప్రయాణించిన మార్గం, సేవింగ్ అయిన డబ్బు, పూర్తిగా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వంటి వివరాలను పొందుపరచాలని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రంలోని మహిళలు పథకం వల్ల తాము పొందుతున్న లాభాలను తేలికగా అర్థం చేసుకోగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చారు.

Vijaya Sai Reddy : విజయసాయి ఊహించని పని చేసి వార్తల్లో నిలిచాడు

ఈ పథకం అమలుతో ఆర్టీసీపై ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇతర ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల్లోకి తేవాలని సూచించారు. ప్రభుత్వ సహకారం తోపాటు ఆర్టీసీకి స్వయం సమర్థత కూడా అవసరమని ఆయన వివరించారు. ఈ విషయాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

అదే సమయంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై సీఎం దృష్టిసారించారు. ఇకపై రాష్ట్రంలో కొత్తగా కొనుగోలు చేసే బస్సులన్నీ ఏసీ ఎలక్ట్రిక్ వాహనాలే కావాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ ఛార్జింగ్ అవసరాలను తీర్చాలని, అన్ని డిపోలలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుపై తగిన అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ చర్యలతోపాటు ఉచిత ప్రయాణ పథకం విజయవంతంగా అమలు కావడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది.