Site icon HashtagU Telugu

CM Chandrababu : వరద ప్రాంతాల్లో నాలుగో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

Fourth day visit of CM Chandrababu in flood areas

Fourth day visit of CM Chandrababu in flood areas

CM Chandrababu: సీఎం చంద్రబాబు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో రోజు పర్యటించారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో జేసీబీలో ప్రయాణిస్తూ వరద బాధితులను పరామర్శించారు. ఆహారం, తాగునీరు అందుతుందా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇస్తూ పర్యటన కొనసాగించారు. మరోవైపు వరద తగ్గడంతో బురద తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఫైరింజన్లు, పొక్లెయినర్లు, టిప్పర్ల సాయంతో వ్యర్థాలను తొలగిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడలో వరద సహాయక చర్యల పర్యవేక్షణలో సీఎం చంద్రబాబు తలమునకలుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీపై ధ్వజమెత్తారు. అమరావతి మునిగిందన్న వాళ్లను పూడ్చిపెట్టాలని అన్నారు. వరదలపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా? ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయ నేరస్తులను, తప్పుడు ప్రచారం చేసేవాళ్లను సంఘ బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.

కాగా, విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్న ఆయన.. ఇవాళ (బుధవారం) కూడా మరిన్ని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ రోజు జేసీబీపై నాలుగున్నర గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.

మరోవైపు బుడమేరు నీరు ఏలూరు కాలువలోకి పారుతోంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. మధురానగర్, రామవరప్పాడు, ప్రసాదంపాడు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏలూరు కాలువలో వరద ప్రవాహం పెరగడంతో కట్టలు తెగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాలువ గట్టున ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైక్ ద్వారా ప్రచారం చేశారు. కాగా ఏలూరు కాలువ గట్ల ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read Also: Thane : బ్రిడ్జ్‌పై నుండి పడ్డ ట్రక్కు..5 గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌