Sri Ramanavami : ఈరోజు (శనివారం) నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహిచనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల(ఏప్రిల్ 15) వరకు నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, రేపు(ఆదివారం) ఉదయం ధ్వజారోహణం ఉండనుంది. సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Read Also: US Markets Crash: ట్రంప్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా? 5 ఏళ్ల తర్వాత ఘోరంగా పతనం!
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గోపురాలు, కల్యాణ వేదిక, ఇతర ప్రాంతాల్లో విద్యుత్‌దీపాలు అమర్చారు. రేపు ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహన సేవ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు శ్రీ రామనవమి, ఏప్రిల్ 9న హనుమత్ సేవ, 10న గరుడ సేవ జరగనున్నాయి. 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది.
కాగా, శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఉండనుంది. ఏప్రిల్ 6వ తేదీ సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోతన భాగవతం అంశంపై ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7వ తేదీ రామయాణంలోని కాండలపై కవి సమ్మేళనం జరుగుతుంది. మరోవైపు తిరుపతి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.
Read Also: Secret Island : భారత్‌కు చేరువలో అమెరికా – బ్రిటన్ సీక్రెట్ దీవి.. ఎందుకు ?