Site icon HashtagU Telugu

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

Fire At Vizag Steel Plant

Fire at Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖపట్నంలో ఈ ఉదయం సంభవించిన అగ్నిప్రమాదం ఒక్కసారిగా అక్కడికక్కడే హడలెత్తించింది. ప్రముఖ పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్–2 (SMS–2) విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్లాంట్ పరిసరాలు పొగతో కమ్ముకుపోయాయి. ఉదయం సమయమైనా, పనిచేస్తున్న సిబ్బంది సమయస్పూర్తితో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్లాంట్ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎస్ఎంఎస్–2లో ఉన్న ఓ నూనె సరఫరా పైప్ లైన్ లో లీకేజీ ఏర్పడింది. దీని వలన ఆయిల్ బయటకు జారింది. ఆ తరువాత అది మంటలుగా మారి పెద్ద స్థాయిలో వ్యాపించాయి. మంటలు మొదలైన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఫైర్ సేఫ్టీ విభాగానికి సమాచారం అందించారు. తక్షణమే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలను ప్రారంభించాయి.

Read Also: Mango Seed: మామిడి పండు తిన్న తర్వాత టెంక పడేస్తున్నారా.. కానీ ఇక మీదట అలా అస్సలు చేయకండి.. ఎందుకంటే?

స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేకంగా ఉండే అగ్నిమాపక దళాలతో పాటు రెస్క్యూ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వేగంగా చర్యలు చేపట్టాయి. మంటలు ప్లాంట్ మిగతా విభాగాలకు విస్తరించకుండా అడ్డుకోవడం కోసం వారిది గట్టి కృషి. పరిశ్రమలోని అత్యంత కీలకమైన విభాగాల్లో ఒకటైన ఎస్ఎంఎస్–2లో జరిగిన ఈ ప్రమాదం కారణంగా పనితీరు తాత్కాలికంగా నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం, ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయమే. అయితే, ప్రమాద స్థాయిని బట్టి చూస్తే భారీ ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లాంట్ అధికారులు ఇప్పటికే ఆస్తినష్టంపై ప్రాథమిక అంచనాలు ప్రారంభించారు. యంత్రాల్లో పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుందో అన్నది కూడా త్వరలోనే వెల్లడికానుంది.

ఇదిలా ఉండగా, ఈ ప్రమాదానికి గల నిజమైన కారణాలపై సమగ్ర విచారణ జరపనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. భద్రతా ప్రమాణాలు తగిన విధంగా పాటించబడుతున్నాయా? నిర్వహణ లోపాలే ప్రమాదానికి దారితీశాయా? అన్నదానిపై నిగూఢంగా పరిశీలన చేయనున్నారు. ఈ ఘటన పరిశ్రమల భద్రతపై మళ్లీ చర్చను తెరపైకి తెచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో నిలవాలనుకుంటే పరిశ్రమలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.

Read Also: Pink Salt Benefits: పింక్ సాల్ట్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!