AP Voters List : ఓటర్ల తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాల వారీగా ఓటర్ల లిస్టులను రిలీజ్ చేశారు. ఓటర్లు తమ ఓట్ల వివరాలను ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ రూపంలో ఓటర్ల జాబితాలను ఈ వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో దాదాపు 5.86 లక్షల మేర ఓటర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఓటర్ల జాబితాలో అవకతవకలపై నెల్లూరు, బాపట్ల, నంద్యాల, అనంతపురం, కోనసీమ, కాకినాడ, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి, గుంటూరు జిల్లాల్లో 70 కేసులు నమోదయ్యాయి. తుది జాబితాపై అభ్యంతరాల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. స్పెషల్ సెల్ ఇన్‌చార్జిగా అదనపు సీఈఓ హరేంధీర ప్రసాద్ వ్యవహరిస్తారు. ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. నామినేషన్ చివరి రోజు వరకు ప్రజలు ఓట్లను(AP Voters List) నమోదు చేసుకోవచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
ఓట్ల గణాంకాలివీ..
- మొత్తం ఓటర్లు: 4,08,07,256
- పురుషులు: 2,00,09,275
- మహిళలు: 2,07,37,065
- థర్డ్ జెండర్: 3482
- సర్వీస్ ఓటర్లు: 67,434
- అత్యధిక ఓటర్లు: కర్నూలు జిల్లా – 20.16 లక్షలు
- అత్యల్ప ఓటర్లు: అల్లూరి జిల్లా – 7.61 లక్షలు
ఓటును చెక్ చేసుకోవడం ఇలా..
- https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html కు వెళ్లండి
- అందులో SSR-2024 కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
- ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో పైన ‘సెర్చ్ యువర్ నేమ్’ కనిపిస్తుంది. ఆ తర్వాత అందులోకి వెళ్లండి.
- మీ పేరు, పుట్టినరోజు వంటి వివరాలు నమోదు చేయగానే.. మీ ఓటు వివరాలు ప్రత్యక్షం అవుతాయి.
ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు సస్పెండ్
- 18-19 ఏళ్ల మధ్య వయస్సున్న కొత్త ఓటర్లు 8.13 లక్షల మంది ఉన్నారు.
- ఒకే ఇంట్లో పది మందికిపైగా ఓటర్లున్నారని వచ్చిన ఫిర్యాదులను సుమారు 98 శాతం వరకు పరిష్కరించారు.
- 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.5.64 లక్షల ఓట్లను తొలగించారు.
- ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ విషయంలో ఓ ఐఏఎస్ అధికారి సహా ముగ్గురు సస్పెండ్ అయ్యారు.
నకిలీ ఓట్ల వివాదం
రాష్ట్రంలో నకిలీ ఓట్ల నమోదు, అసలు ఓట్ల తొలగింపు భారీ ఎత్తున జరుగుతోందని, ఇతర రాష్ట్రాల్ల ఓటు హక్కు కలిగిన వారు ఇక్కడ ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారని వైసీపీ, టీడీపీ ఈసీకి పలు ఫిర్యాదులు చేశాయి. అయితే వీటిలో ఎన్ని ఫిర్యాదులను ఈసీ పరిశీలించి మార్పులు చేసిందనేది తుది ఓటర్ల జాబితాలను పూర్తిగా పరిశీలిస్తే కానీ తెలిసే పరిస్దితి లేదు. దీంతో ఈ జాబితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లా కలెక్టర్లు విడుదల చేసే జాబితాలు లేదా ఆన్ లైన్లో డౌన్ లోడ్ చేసిన జాబితాలను పరిశీలించిన తర్వాత రాజకీయ పార్టీలు దీనిపై స్పందించే అవకాశముంది.