విజయవాడలో గురువారం రాత్రి సినిమా రేంజ్ సీన్లు కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీపులతో బీభత్సం సృష్టించారు. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికి థార్ జీపులతో ఢీకొట్టుకున్నారు. ఆ తర్వాత రాడ్లతో జీపులను ధ్వంసం చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు… ఒకరిని అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడలో ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్న ఇద్దరికి ఓ అమ్మాయి విషయంలో గొడవ మొదలైంది. వారిద్దరి మధ్య ఈ వివాదం మరింత ముదిరింది. చివరికి ఇద్దరు స్నేహితులు నడిరోడ్డుపై కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లారు. ఇద్దరు థార్ కార్లతో రోడ్డుపై హంగామా చేశారు. ఇద్దరు రెండు కార్లతో ఢీకొట్టుకున్నారు. రెండు కార్లు ధ్వంసమైనా సరే వెనక్కు తగ్గలేదు. ఆ తర్వాత ఇద్దరు బ్యాట్లతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనతో జనాలు భయపడ్డారు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ హైటెన్షన్ రోడ్డులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
విజయవాడ తాడిగడప ప్రాంతానికి చెందిన లింగమనేని రోహిత్, విజయవాడ భారతీ నగర్కు చెందిన బొల్లా ఓమ్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. రోహిత్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఓమ్ తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఓ యువతి విషయంలో వివాదం మొదలైంది. ఓమ్ రోహిత్కు ఫోన్ చేసి ఎక్కడున్నావని ఆరా తీశాడు. అలా మెల్లగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్ హైటెన్షన్ రోడ్డులో ఉన్నానని రోహిత్ చెప్పాడు. ఇద్దరి మధ్య సవాళ్లు కూడా నడిచాయి.
గురువారం రాత్రి ఓమ్ తన థార్ జీప్ తీసుకుని హైటెన్షన్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడ రోహిత్ థార్ జీప్ను ఢీకొట్టాడు. ఇద్దరూ జీప్లను ఒకదానికొకటి ఢీకొట్టుకున్నారు. రెండు థార్ జీప్లు అలా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనాలు కంగారుపడ్డారు. ఆ రోడ్డులో వాకింగ్ చేస్తున్న వారితో పాటు స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత ఇద్దరూ రాడ్లతో జీప్ల అద్దాలను కూడా పగులగొట్టుకున్నారు. కొంతమంది స్థానికులు ఈ గొడవ గురించి ఆ పక్కనే ఉన్న పటమట పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి రావడంతో రోహిత్ తన జీప్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు ఓమ్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి ప్రశ్నించారు. ఈ గొడవ జరిగిన సమయంలో ఓ యువతి కూడా అక్కడే ఓ జీప్లో ఉంది. మరికొందరు యువకులు మరో జీప్లో ఉన్నారు.
