Site icon HashtagU Telugu

Inhuman Incident: జగన్ పాలన ‘అమానవీయం’

Tirupati

Tirupati

ఏపీలో వరుసగా అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో యువతి పై సామూహిక అత్యాచారం ఘటన మరవకముందే, నేడు అంబులెన్స్ దందా కారణంగా మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని తండ్రి 90 కి.మీ. బైక్ పై తీసుకెళ్లి అంత్యక్రియలు చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతి రుయా ఆస్పత్రి నుండి బాలుడు జాషువ మృతదేహాన్ని తరలించడానికి తండ్రి అంబులెన్స్ కావాలని వేడుకున్నాడు. ఆస్పత్రి యాజమాన్యం కనికరం చూపకపోవడంతో తన సొంత బైక్  పైనే రాజంపేట జిల్లాలోని సొంతూరైన చిట్వేలుకు 90 కి.మీ. మేర బాలుడి మృతదేహాన్ని తరలించాడు. బైక్ పై కుమారుడి డెడ్ బాడీని తరలిస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ వార్త ఏపీలో చర్చనీయాంశంగా మారుతోంది.

జగన్ మొద్దు నిద్ర వీడాలి

ఈ ఘటనపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ ను ప్రశ్నించారు. ‘‘అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? చేతగాని పాలకుడు YS Jagan Mohan Reddy గారి చెత్త పాలన కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం  పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలి’’ అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

నిత్యం ఇబ్బందులే

గత సంవత్సరం మే 10న తిరుపతి రుయా ఆస్పత్రిలో 11 మంది మరణించడం కూడా ఆస్పత్రి వైఫల్యానికి అద్దం పట్టింది. సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోవడంతో నిల్వలు తగ్గి తగినంత ప్రెజర్‌తో ఆక్సిజన్ సరఫరా కాకపోవడమే ఘటనకు కారణమని తేల్చింది. కనీస సౌకర్యాలు లేకపోవడం, వైద్యుల కొరత వేధిస్తుండటం, అపరిశుభ్రత లాంటి సమస్యలతో రోగులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లు జరిగితే వెంటనే రుయా ఆసుపత్రికి తరలిస్తారు అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనేక జిల్లాల నుంచి పేద ప్రజలు వైద్యం కోసం రుయా ఆస్పత్రికి వస్తారు కానీ “ఎమర్జెన్సీ వార్డులో పడకల కొరత” కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెరుగైన వసతులు కల్పించాలని ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.