Chandrababu: బడ్జెట్ పై ‘బాబు’ రియాక్షన్..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదనీ, వేతన జీవులకు మొండిచేయి చూపించినట్టుగా ఉందని బాబు నాయుడు అన్నారు.

  • Written By:
  • Publish Date - February 1, 2022 / 05:42 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదనీ, వేతన జీవులకు మొండిచేయి చూపించినట్టుగా ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నదులు అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను స్వాగతిస్తున్నామని, డిజిటల్, సోలార్, ఎలక్ట్రికల్ వెహికిల్ రంగంలో సంస్కరణలు మంచి పరిణామమని బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో మరోసారి వైసీపీ విఫలమైందని, 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారు అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలకు సొంత ప్రయోజనాలపై తప్ప.. రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ద లేదని చంద్రబాబు అన్నారు.

పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరమని, పేద వర్గాలు, కోవిడ్ తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్ లో చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చెయ్యడం సరికాదని,  నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. టీడీపీ హయాంలో కృష్ణా – గోదావ‌రి -పెన్నా నదుల అనుసంధానం పై ప్రణాళికలు కూడా సిద్దం చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా నదుల అనుసంధానంపై కేంద్రం ముందడుగు వెయ్యడాన్ని చంద్రబాబు స్వాగతించారు.

విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని చంద్రబాబు ఆహ్వానించారు. గతంలో దేశంలో మొట్టమొదటి సారిగా ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీని తెచ్చామన్నారు. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ విషయంలో కేంద్ర ప్రతిపాదనలు మంచి నిర్ణయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.