Electricity Charges Hike : ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్. రేపటి (డిసెంబరు 1) నుంచి రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డిసెంబరు 1 నుంచి ఒక యూనిట్ విద్యుత్‌కు 92 పైసలు చొప్పున ఛార్జీలు పెరుగుతాయి. ఈ పెంపు 2026 నవంబర్ వరకు అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంతో ప్రతినెలా 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించే వారి కరెంటు బిల్లు అదనంగా రూ.184 మేర పెరుగుతుంది.
Also Read :Eknath Shinde : ‘మహా’ సస్పెన్స్.. సాయంత్రంకల్లా ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయం
కరెంటు ఛార్జీల(Electricity Charges Hike) పెంపుతో ఏపీ ప్రజలపై రూ.7,912 కోట్ల మేర భారం పడనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ విద్యుత్ రాయితీలకుగానూ రూ.9,412 కోట్లలో రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా, దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై భారం పడనుంది. ఈఆర్సీ అనుమతి మేరకు రూ.9,412 కోట్లలో డిస్కంలు ప్రతినెలా 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లను వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేశాయి. మిగిలిన రూ.6,543.60 కోట్లను డిసెంబర్ 1 నుంచి 2026 నవంబర్ వరకూ వసూలు చేయాలని ఈఆర్సీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read :KTR Break : రాజకీయాలకు బ్రేక్.. కేటీఆర్ సంచలన ట్వీట్
ఏ డిస్కం పరిధిలో ఎంత పెంపు ?
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్‌పీడీసీఎల్) పరిధిలో యూనిట్‌కు 0.9132 పైసలు చొప్పున, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) పరిధిలో యూనిట్‌కు 0.9239 పైసలు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) పరిధిలో యూనిట్‌కు 0.9049 పైసలు చొప్పున కరెంటు ఛార్జీలు పెంచనున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా ఎనిమిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచింది. నాటి వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు ప్రజలకు కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.