Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ముగ్గురు విద్యార్దునులు కరెంటు షాక్ కొట్టి ఆస్పత్రి పాలయ్యారు. బాలికల్లో ఒకరు స్పృహతప్పి పడిపోగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం ఇంటికి పంపించేశారు. వివరాలలోకి వెళితే…
విజయవాడలోని ఈడుపుగల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లను మరమ్మతు చేయడానికి పాఠశాల యాజమాన్యం ఇద్దరు ఎలక్ట్రీషియన్స్ ను పిలిపించారు. అయితే వారు మరమ్మతులు చేస్తుండగా రాక్షస ఆనందం కోసం పాఠశాల విద్యార్థుల్ని టార్గెట్ చేశారు. పాఠశాలలో స్టీల్ బెంచీలు కావడంతో ఉద్దేశపూర్వకంగా పదేపదే విద్యుత్ షాక్‌లు ఇస్తూ వెకిలిగా ప్రవర్తించారు. ఈ క్రమంలో బాలికలు విద్యుత్ షాక్ తో ఇబ్బంది పడ్డారు. అలా పలు మార్లు జరగడంతో ముగ్గురు విద్యార్దునులు ఆస్పత్రి పాలయ్యారు.
Also Read: Murder : ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య.. నలుగురు అరెస్ట్
అయితే బాలికలు ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ చర్యకు పాల్పడిన కంకిపాడుకు చెందిన మర్రివాడ సూరిబాబు (30), విజయ శేఖర్ (45) అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.