MLC by election : కేంద్ర ఎన్నికల సంఘం ‘తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఇవాళ మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న యూటీఎఫ్ నేత షేక్ సాబ్జీ గతేడాది డిసెంబరు 15న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన పదవీ కాలం 2027 మార్చి 29 వరకు ఉండటంతో అక్కడ బైపోల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం నవంబరు 11న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈసీ తెలిపింది. నవంబర్ 18 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబరు 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ డేట్ నవంబర్ 21. డిసెంబరు 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపును నిర్వహించి ఫలితాలు అనౌన్స్ చేస్తామని ఈసీ(MLC by election) వెల్లడించింది.
Also Read :TTD : ‘వక్ఫ్ బోర్డు’ రియల్ ఎస్టేట్ కంపెనీ.. ఒవైసీ వ్యాఖ్యలకు టీటీడీ చీఫ్ కౌంటర్
ఇక దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ తేదీలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. ఇంతకుముందు ఈసీ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. కేరళ, పంజాబ్, యూపీలలోని 14 అసెంబ్లీ సీట్లలో నవంబర్ 13న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీతో పాటు పలు సంస్థలు పోలింగ్ తేదీని మార్చాలని ఈసీని కోరాయి. పోలింగ్ తేదీల్లో పలు సామాజిక, సాంస్కృతిక, మత సంబంధమైన కార్యక్రమాలు ఉన్నాయని తెలిపాయి. ఆ తేదీల్లో ఎన్నిక నిర్వహిస్తే పోలింగ్ శాతం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. కేరళ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ తేదీని నవంబర్ 20కు మార్చింది. కేరళలో ఒకటి, పంజాబ్‌లో 4, యూపీలో 9 నియోజకవర్గాల్లో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. మిగతా స్థానాల్లో మాత్రం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.