Dasara Celebrations: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వైభవంగా జరిగే పండుగలలో దసరా (Dasara Celebrations) నవరాత్రి ఉత్సవాలు ఒకటి. ముఖ్యంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈసారి తిథి వృద్ధి చెందడం వల్ల దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహించడం ఒక ప్రత్యేకత.
11 రోజులు, 11 అలంకారాలు
ప్రతి ఏడాదిలా కాకుండా ఈసారి అమ్మవారు 11 అద్భుతమైన అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు సెప్టెంబర్ 22న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం శ్రీ గాయత్రీ దేవి, అన్నపూర్ణా దేవి, కాత్యాయినీ దేవి, మహాలక్ష్మీ దేవి, లలితా త్రిపుర సుందరి దేవి, మహాచండీ దేవి, దుర్గా దేవి, మహిషాసురమర్దినీ దేవి, రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు.
మూలా నక్షత్రం ప్రత్యేకత
సెప్టెంబర్ 29 మూలా నక్షత్రం రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అలంకరిస్తారు. ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ రోజున భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Increase Working Hours : ఏపీలో రోజువారీ పని గంటలు పెంపు
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
సుమారు 18 నుంచి 20 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో మంచినీరు, పాలు, అల్పాహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా 5,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, భక్తులకు మార్గనిర్దేశం చేయడానికి ఏఐ (AI) టెక్నాలజీని కూడా ఉపయోగించనున్నారు.
విజయవాడ ఉత్సవ్
ఈ దసరా ఉత్సవాల సందర్భంగా “విజయవాడ ఉత్సవ్” పేరుతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మైసూర్ దసరా తరహాలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో స్టాల్స్, వాటర్ స్పోర్ట్స్, దాండియా నృత్యాలు, లైవ్ మ్యూజిక్ కచేరీలు వంటివి ఏర్పాటు చేయనున్నారు. భక్తులు దర్శనం తర్వాత కూడా విజయవాడలో ఉండేలా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.
అక్టోబర్ 2న విజయదశమి రోజున మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. అనంతరం సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలన్నీ భక్తులకు భక్తిశ్రద్ధలతో కూడిన అనుభవాన్ని అందించేందుకు అధికారులు, ఆలయ సిబ్బంది సంసిద్ధులవుతున్నారు.

