వర్షాకాలంలో రోడ్లపై గుంతలు ఏర్పడటం, వాటి మరమ్మతులు చేయడంలో జాప్యం జరగడం సాధారణ సమస్య. వర్షాలు తగ్గే వరకు వేచి ఉండాల్సిందేనని అధికారులు చెప్పేవారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) అభివృద్ధి చేసిన ‘ఎకోఫిక్స్’ (Ecofix)అనే కొత్త సాంకేతికత ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది. ఈ వినూత్న మిశ్రమంతో వర్షంలోనూ రోడ్ల మరమ్మతులు చేయవచ్చు. దీని ద్వారా వర్షాకాలంలో గుంతలతో ఇబ్బందులు పడే పరిస్థితికి ఇకపై స్వస్తి చెప్పవచ్చు.
ఎకోఫిక్స్ మిశ్రమం తయారీకి స్టీల్‌స్టాగ్ అనే వ్యర్థ పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఇది ఉక్కు పరిశ్రమల నుంచి లభిస్తుంది. ఈ వ్యర్థాన్ని కొన్ని రసాయనాలతో ప్రాసెస్ చేసి, 12 ఎంఎం కంటే చిన్న సైజులో ఉన్న కంకర, తారుతో కలిపి మోడిఫైడ్ బిటమిన్‌గా మారుస్తారు. ఈ ప్రత్యేక మిశ్రమాన్ని 30 కేజీల బస్తాల్లో నింపి సరఫరా చేస్తారు. రోడ్లపై గుంతలు ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని వెంటనే ఉపయోగించి మరమ్మతులు చేయవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, గుంతల్లో నీరు నిండి ఉన్నా దాన్ని తొలగించకుండానే ఈ మిశ్రమాన్ని వేయడం సాధ్యమవుతుంది.
APSRTC : ఫ్రీ బస్ లలో సీసీ కెమెరాలు..?
ఎకోఫిక్స్ మిశ్రమంతో చేసే మరమ్మతులు సాధారణ పద్ధతులతో చేసిన వాటికంటే ఎక్కువ నాణ్యతగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రోడ్లకు ఎక్కువ మన్నికను ఇస్తుంది. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ సాంకేతికతను విజయవంతంగా ఉపయోగించారు. దీని ఫలితాలు సానుకూలంగా ఉండటంతో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
సోమవారం అమరావతిలోని మందడం వద్ద, విజయవాడలోని చిట్టినగర్ సొరంగం రోడ్డు వద్ద ఎకోఫిక్స్ మిశ్రమంతో రోడ్డు గుంతలను పూడ్చారు. మందడం వద్ద జరిగిన పనులను రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ కొత్త సాంకేతికతను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే వర్షాకాలంలో రోడ్డు గుంతల సమస్య చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు.