Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతిచ్చింది. రాజధాని అమరావతి పనులకు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఈసీ ఓ లేఖ రాసింది. కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు.
Read Also: Indian immigrants : అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తేమీ కాదు..!
దీనిపై స్పందించిన ఈసీ.. రాజధానిలో పనులకు అభ్యంతరం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని లేఖలో పేర్కొంది. ఇక, అమరావతిలో 14 వేల కోట్ల విలువైన పనులు చేటపట్టామని అవి ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలంటే కోడ్ అడ్డం వస్తుందని సీఆర్డీఏ తెలిపింది.
ఆ లేఖకు ఈసీ స్పందించింది. టెండర్ల ప్రక్రియ జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి అమరావతి నిర్మాణానికి రుణం లభించింది. గత నెల నుంచి సీఆర్డీయే బిడ్లను కూడా ఆహ్వానిస్తోంది. వీటిని ఈ నెల ఏడో తేదీన తెరవాల్సి ఉంది. అయితే కోడ్ కారణంగా టెండర్లు ఫైనలైజ్ చేయడానికి అనుమతి నిరాకరించిన ఈసీ, కొత్తవాటిని పిలవడానికి అనుమతి మాత్రం ఇచ్చింది.
కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిపై ఫోకస్ పెట్టింది. రాజధాని పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కానీ అంతలోనే బ్రేక్ పడింది. అందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎన్నికల కోడ్ అమరావతి పనులకు అడ్డింకిగా మారింది. ఈ క్రమంలోనే సీఆర్‌డీఏ ఈసీకి లేఖ రాసింది. రాజధాని అమరావతిలో వివిధ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలోని లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైన్లు, ఇంటర్నెట్ తీగలు వేసేందుకు డక్ట్‌ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.