ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రభుత్వ దిశానిర్దేశంపై, ప్రతిపక్ష వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి పదిహేనేళ్లు పాలన సాగిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి (Governor’s Speech) ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ (YCP) తీరును తీవ్రంగా విమర్శించారు. వైసీపీ వ్యవహారశైలిని వివేకా హత్య కేసుతో పోల్చుతూ, వారు రాజకీయ అప్రజాస్వామ్య ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. చట్టాల ఉల్లంఘన, డాక్టర్ సుధాకర్ ఘటన, చంద్రబాబు అరెస్ట్ వంటి సంఘటనలే ప్రతిపక్ష వైఖరికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పదిహేనేళ్లు ఎన్డీఏ కూటమి కలిసి ఉంటుందన్న హామీ
ప్రజలకు ఎన్డీఏ కూటమి పాలనపై భరోసా ఇస్తూ పవన్ కళ్యాణ్ కనీసం 15 ఏళ్ల పాటు తమ కూటమి ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని హామీ ఇచ్చారు. ఏ విధమైన లోపాలు వచ్చినా, ప్రభుత్వంలోని పార్టీల మధ్య ఏమైనా విభేదాలొచ్చినా, అవన్నీ పక్కన పెట్టి కలిసే ఉంటామని స్పష్టం చేశారు. వైసీపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అసెంబ్లీలో హాజరయ్యే బాధ్యతను వదిలేస్తున్నప్పుడు, అధికారపక్షమే ఆ బాధ్యతను నిర్వహించాలని తాము సంకల్పించామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయగా, కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను పటిష్టం చేస్తూ, అభివృద్ధికి దారి తీస్తుందని చెప్పారు.
వైసీపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా
గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేయడం గర్వించదగిన విషయమని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి గౌరవనీయమైన వ్యక్తిని అవమానించటాన్ని తాము సహించబోమని, అసెంబ్లీలో వైసీపీ నేతల తీరును ఖండించారు. సీఎం చంద్రబాబు తమకు సద్వ్యవహారంపై మార్గదర్శకత్వం ఇస్తుంటారని గుర్తుచేసుకున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అసెంబ్లీలో మర్యాదల్ని పాటించకుండా వ్యవహరించారని విమర్శించారు. గవర్నర్‌ను అవమానించిన పార్టీకి అసెంబ్లీలో ఉండే హక్కు లేదని తేల్చి చెప్పారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు
ఏపీ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని, గత ప్రభుత్వంతో పోల్చితే తాము తక్కువ కాలంలోనే ఎక్కువ అభివృద్ధి సాధించామన్నారు. గవర్నర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఆయనకు గౌరవం ఇచ్చే వైసీపీ నేతలు ఇప్పుడు అసెంబ్లీలో అతన్ని అవమానించడం విచిత్రమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో తమ రాష్ట్రం గురించి గర్వం ఉందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో కులాల ఆధిపత్య భావనే కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రమే ఆంధ్రులం అనే భావన వస్తుందని, మిగతా అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రజలు ఐక్యతను చూపాలని సూచించారు. కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని పవన్ స్పష్టం చేశారు.