అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన డిమాండ్ పై జగన్ స్పందించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘నా చెల్లెలి గురించి ఇక్కడ మాట్లాడటం వద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 1.7% ఓటు షేర్ మాత్రమే ఉంది. ఏమాత్రం ప్రభావం చూపని అలాంటి పార్టీ గురించి మాట్లాడటం అనవసరం’ అని అన్నారు.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా వైసీపీ నేతలు సమావేశాలకు దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీ నేతలపై షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ (AP Assembly)కి వెళ్లని జగన్ (Jagan), ఆయన ఎమ్మెల్యేలు(YCP MLAS) వెంటనే రాజీనామా (Resign ) చేయాలంటూ APPCC చీఫ్ షర్మిల్ (YS Sharmila) డిమాండ్ చేసారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ షర్మిల అన్నారు. అంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనపడవు, వినపడవని మండిపడ్డారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే వైసీపీ సోషల్ మీడియా పై కూడా షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వైసీపీ సోషల్ మీడియాను ఏకంగా సైతాన్ సైన్యంతో పోల్చారు. ఈ సైతాన్ సైన్యానికి నాయకుడు జగనేనని అన్నారు. ‘సోషల్‌మీడియాలో అసభ్యంగా పోస్టులు చేసిన విషనాగులను పట్టుకుంటున్నారు. వాటిని పెంచుతున్న అనకొండను కూడా పట్టుకోవాలి’ అని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేయించింది జగనే అని షర్మిల కుండబద్దలు గొట్టారు. మహిళలపైనా, అమ్మ, చెల్లెళ్లపైనా వికృతంగా పోస్టులు పెడుతుంటే ఆపలేదంటే.. వాటి వెనుక జగన్ ఉన్నట్టేకదా అని ప్రశ్నించారు. ‘ప్రతిపక్ష నేత హాదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాననడం జగన్‌కు భావ్యమేనా?, నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తాల్సిన బాధ్యత జగన్‌కు లేదా?’ అని నిలదీశారు. అసెంబ్లీలో మైకు ఇవ్వని పరిస్థితి రావడానికి జగన్ స్వయంకృపరాధమని పేర్కొన్నారు. ‘కూటమి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెడితే అసెంబ్లీకి వెళ్లరా? బడ్జెట్ పద్దులపై ప్రతిపక్షంకాక మరెవరు ప్రశ్నిస్తారు? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేది ఎవరు?’ అని ప్రశ్నించారు.
Read Also :ICICI Credit Card New Rules : ICICI క్రెడిట్ కార్డు వాడే వారు తప్పక తెలుసుకోవాల్సిన వార్త..