Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న తరుణంలో ఇలాంటి కుట్రలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ కుట్రదారుల కుయుక్తులను పదేళ్లుగా చూస్తున్నామని, వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోనై ఘర్షణలకు తావీయవద్దని సూచించారు.
కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల్లో అశాంతి, అభద్రత కలిగించే వారి నైజాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఆవేశాలకు లోనైతే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని హెచ్చరించారు.
Also Read: Kia Seltos: ఈ కియా కారుపై ఏకంగా రూ. 2 లక్షల డిస్కౌంట్!
సమస్యను జటిలం చేయవద్దు
ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొంటూ, ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష వాడడం వెనుక ఉన్న కుత్సిత ఆలోచనను గమనించాలని అన్నారు. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టాలని, తొందరపడి ఘర్షణలకు దిగి సమస్యను జటిలం చేయవద్దని సూచించారు.
చట్ట ప్రకారం చర్యలు
కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, విశ్లేషకుల ముసుగులో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకరంగా మాట్లాడే వారిని భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. వీరి వెనుక ఉన్న వ్యవస్థీకృత కుట్రదారులపై కూడా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలని స్పష్టం చేశారు. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ జరిపించాలని, ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.