New Teachers Salaries : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 12 ఏళ్ల క్రితం రద్దయిన అప్రెంటిస్‌షిప్ విధానమే మళ్లీ అమల్లోకి వచ్చింది. డీఎస్సీ-2024 ద్వారా ఇకపై ఎంపికయ్యే టీచర్లు రెండేళ్లపాటు అప్రెంటిస్‌షిప్ చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ వ్యవధిలో టీచర్లకు గౌరవ వేతనం ఇస్తారు. ఈసారి డీఎస్సీ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు తొలి ఏడాది ఆయా కేటగిరిల్లోని బేసిక్‌లో 50 శాతం, రెండో ఏడాది 60 శాతం గౌరవవేతనం ఇస్తారు. అప్రెంటిస్‌షిప్ పూర్తయ్యాక రెగ్యులర్ స్కేల్ ఇస్తారు. అప్రెంటిస్‌షిప్ సమయంలో ఇంటర్నేషనల్ బకలారియెట్ (ఐబీ) కరిక్యులమ్, పెడగాజీ, బోధనలో డిజిటల్ టెక్నాలజీ అమలు, టోఫెల్‌లాంటి మదింపులో నిపుణత, ఆంగ్లమాధ్యమం బోధించడంలో నిపుణతపై శిక్షణ అందిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
అప్రెంటిస్‌షిప్ సమయంలో కొత్త టీచర్లకు ఇవ్వనున్న శాలరీ.. ఔట్ సోర్సింగ్ సేవల సిబ్బందికి ఇచ్చే గౌరవ వేతనానికి కొంచెం అటుఇటుగానే ఉంటుంది. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) బేసిక్ రూ.32,670గా ఉంది. ఇందులో 50 శాతమంటే రూ.16,335 తొలి ఏడాదిలో ఇస్తారు. రెండో ఏడాదిలో రూ.19,602 ఇస్తారు. స్కూల్‌అసిస్టెంట్లు, టీజీటీలకు రూ.22,285, రూ.26,742 చొప్పున అందిస్తారు. పీజీటీలకు మొదటి ఏడాది రూ.24,220, రెండో ఏడాది రూ.29,064 గౌరవ వేతనం(New Teachers Salaries) అందుతుంది.
Also Read : Mithun Chakraborty : మిథున్ చక్రవర్తికి అస్వస్థత.. ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిక
ఈసారి డీఎస్సీ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని యాజమాన్యాల్లో ఎస్జీటీ 2 వేలు, స్కూల్ అసిస్టెంట్లు 2,060, ఆదర్శ పాఠశాలల్లో ప్రిన్సిపళ్లు 15, పీజీటీలు 23, టీజీటీ 248, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రిన్సిపళ్లు 4, పీజీటీలు 53, టీజీటీ 118 పోస్టులున్నాయి. సాంఘిక సంక్షేమంలో టీజీటీ 386, బీసీ సంక్షేమ ప్రిన్సిపళ్లు 23, పీజీటీ 81, టీజీటీ 66, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ 226, టీజీటీ 280, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌లో పీజీటీ 58, టీజీటీ 446, వ్యాయామ ఉపాధ్యాయులు 13 పోస్టులు ఉన్నాయి.