AP : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం మరో అడుగు ముందేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సోమవారం నుండి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ వరలక్ష్మీనగర్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేషన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించాం. ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉన్నందున, ఎవరెప్పుడు రేషన్ తీసుకున్నారన్న సమాచారం తక్షణమే కేంద్ర మరియు జిల్లా కార్యాలయాలకు చేరుతుంది అని వెల్లడించారు.
Read Also: Mega DSC : మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా..! ఎందుకంటే..!
ఈ స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారుల ఆధారిత సమాచారం, కొనుగోలు వివరాలు తేలికగా ట్రాక్ చేయవచ్చని మంత్రి వివరించారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా, మోసాలను నివారించడంలో కీలకంగా నిలవనుంది. ప్రస్తుతం తొలిదశలో తొమ్మిది జిల్లాల్లో ఇంటింటికీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుపుతున్నారు. మొత్తం 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 లోపు ఈ కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినవారికీ, చిరునామా మార్చినవారికీ సైతం కార్డులు అందజేస్తామన్నారు. రాబోయే కాలంలో రేషన్ షాపుల ద్వారా గోధుమలు పంపిణీ చేసే ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నామని, ప్రజల అవసరాల మేరకు ఈ విధానం మరింత విస్తృతంగా అమలవుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 29,797 రేషన్ షాపులు ఉన్నాయి. అవసరమైతే ఈ సంఖ్యను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు. ఇక, డీలర్ల వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రాలను కూడా ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త యంత్రాలు మరింత వేగవంతమైన సేవలందించడంతోపాటు, లావాదేవీలలో ఖచ్చితత తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, అవసరమయ్యే ప్రాంతాల్లో సబ్ డిపోల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ, సంక్షేమాన్ని ముందుపెట్టే ఈ స్మార్ట్ రేషన్ వ్యవస్థ, సాంకేతికత ఆధారిత పాలనకు గొప్ప ఉదాహరణగా నిలవనుంది. భవిష్యత్తులో రేషన్ పంపిణీ మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.