Kotamreddy Sridhar Reddy : వైసీపీలో “కోటంరెడ్డి” క‌ల‌క‌లం..జై అమ‌రావ‌తి నినాదం..!

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి వైసీపీ విధానానికి వ్య‌తిరేకంగా న‌డిచాడు. అమ‌రావ‌తి రైతుల‌కు సంఘీభావం తెలిపాడు.

  • Written By:
  • Updated On - November 29, 2021 / 01:24 PM IST

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి వైసీపీ విధానానికి వ్య‌తిరేకంగా న‌డిచాడు. అమ‌రావ‌తి రైతుల‌కు సంఘీభావం తెలిపాడు. మ‌హాపాద యాత్ర సంద‌ర్భంగా నెల్లూరులో బస‌చేసిన రైతులను క‌లిశాడు. ఎలాంటి అవ‌స‌రం ఉన్న‌ప్ప‌టికీ మీ వెంట ఉంటాన‌ని హామీ ఇచ్చాడు. ఆయ‌న వాల‌కం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద నెల్లూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఏడాది క్రితం తిర‌గ‌బ‌డ్డాడు. ఆయ‌న బాట‌న ప్ర‌కాశం జిల్లా ఎమ్మెల్యే మ‌హీంధ‌ర్‌రెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌కు చెందిన కొంద‌రు ఎమ్మెల్యేలు ఆనాడు న‌డిచారు. క‌నీసం మంచినీళ్ల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు అందించ‌లేని పరిస్థితుల్లో ఉన్నామ‌ని మాజీ మంత్రి, కందూరు ఎమ్మెల్యే మహీంధ‌ర్ రెడ్డి అన్నాడు. జ‌గ‌న్ పాల‌నలో ప్ర‌జా సంబంధ‌మైన ప‌నులు ఏమీ చేయ‌లేక‌పోతున్నామ‌ని రామ‌నారాయ‌ణ‌రెడ్డి నిరుత్సాహ‌ప‌డ్డాడు. అదే జిల్లాకు చెందిన కొవూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి జ‌గ‌న్న‌న్న‌కాల‌నీల మీద మండిప‌డ్డాడు. మూడు రాజ‌ధానుల విష‌యంలో నాగార్జున రెడ్డి వ్య‌తిరేకంగామాట్లాడాడు. ఆనాటి నుంచి నివురుగ‌ప్పిన నిప్పులా జ‌గ‌న్ మీద ఉన్న వ్య‌తిరేక‌త మ‌ళ్లీ తాజాగా కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి రూపంలో క‌నిపిస్తోంది.

Also Read : అమరావతి రైతులను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి; జగన్ కు షాక్ ఇచ్చారా?

సుమారు12 మంది ఎమ్మెల్యేలు క‌రోనా ప్రారంభానికి ముందు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న మీద వ్య‌తిరేక గ‌ళం వినిపించారు. రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు ప్ర‌తి రోజూ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో భాగంగా దుమ్మెత్తిపోస్తున్నాడు. ఒకానొక స‌మ‌యంలో వైసీపీ నుంచి పెద్ద సంఖ్య‌లో ట‌చ్ లో ఉన్నార‌ని ఏపీ బీజేపీ మైండ్ గేమ్ ఆడింది. క‌రోనా-19 రావ‌డంతో రాజ‌కీయాలు నెమ్మ‌దించాయి. మ‌ళ్లీ ఇప్పుడు మ‌హాపాద‌యాత్ర ను రైతులు చేస్తుండ‌డం, మూడు రాజ‌ధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకోవ‌డంతో సరికొత్త రాజ‌కీయాల‌కు బీజం పడుతోంది.వాస్త‌వంగా శ్రీథ‌ర్ రెడ్డి తొలి నుంచి వైఎస్ ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు. స్వ‌ర్గీయ వైఎస్ హయాంలోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. యూత్ కాంగ్రెస్ లీడ‌ర్ నుంచి వ‌చ్చిన ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సొంత పార్టీ మీద‌నైనా పోరాటం చేస్తాడు. నెల్లూరు ప‌ట్ట‌ణంలో డ్రైనేజి వ్య‌వ‌స్థ బాగాలేద‌ని కొన్ని గంట‌ల పాటు న‌డుముల్లోతు మురికి కాల్వ‌లో దిగి నిర‌స‌న తెలిపాడు. జ‌ర్న‌లిస్ట్ ల మీద జులుం ప్ర‌ద‌ర్శించ‌డంలోనూ ఆయ‌న దిట్ట‌. నెల్లూరు వైసీపీలోని గ్రూప్ ల గురించి రాసిన జ‌ర్న‌లిస్ట్‌ల మీద తిరగ‌బడ్డాడు. రొట్టెల పండ‌గ సంద‌ర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, శ్రీథ‌ర్ రెడ్డి ఫ్లెక్సీల విష‌యంలో బ‌జారున ప‌డ్డారు.
మంత్రి అనిల్‌, శ్రీథ‌ర్ రెడ్డి మ‌ధ్య చాలా కాలంగా ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. సామాజిక ఈక్వేష‌న్ దృష్ట్యా అనిల్ కు మ‌ద్ధ‌తుగా జ‌గ‌న్ నిలుస్తున్నాడు. దీంతో పార్టీలో చురుగ్గా శ్రీథ‌ర్ రెడ్డి ఉండ‌లేక‌పోతున్నాడు. ఆ క్ర‌మంలోనే అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌కు ఆయ‌న సంఘీభావం తెలిపాడ‌ని నెల్లూరు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఆయ‌న టీడీపీ వైపు చూసే ఛాన్స్ ఉందని కొంద‌రు భావిస్తున్నారు. ఆ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ నారాయ‌ణ‌రెడ్డి, వైసీపీ లీడ‌ర్ శ్రీనివాసుల నాయుడు టీడీపీలో చేరారు.

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఊహాగానం మేర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పూర్తి కాలం నిల‌బ‌డ‌దంట‌. జ‌గ‌న్ సీఎం అయిన తొలి రోజుల్లోనే ఆ విష‌యం చెప్పాడాయ‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు 50శాతం పైగా ఓటు బ్యాంకు సంపాదించిన ప్ర‌భుత్వం పూర్తి కాలం ప‌రిపాల‌న చేయ‌లేద‌ట‌. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌, పీవీ నర‌సింహారావు ప్ర‌భుత్వాల‌ను గుర్తు చేస్తున్నాడు. సో..ఆ త‌ర‌హాలో జ‌ర‌గ‌డానికి సంకేతంగా వైసీపీలోని కొంద‌రు క్ర‌మంగా ప‌క్క‌కు జ‌రుగుతున్నారా? అనే అనుమానం క‌లుగుతోంది. మొత్తం మీద జ‌గ‌న్ పాల‌న మీద వ్య‌తిరేకంగా ఉన్న వాళ్లు ఇప్పుడిప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. వాళ్ల జాబితాలో ఇప్పుడు శ్రీథ‌ర్ రెడ్డి కూడా చేర‌డం ఏపీ వ్యాప్తంగా వైసీపీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది.