Site icon HashtagU Telugu

Pawan Kalyan : I Love U అంటూ మన్యం ప్రజల్లో ఉత్సాహం నింపిన పవన్ కళ్యాణ్..

Deputy CM pawan kalyan visit to Manyam district

Deputy CM pawan kalyan visit to Manyam district

Pawan Kalyan : అడవి బిడ్డలంటే తనకు ఇష్టమని.. వారికి ఐ లవ్ యూ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మన్యం జిల్లా బాగుజోలలో ఆయన మాట్లాడారు. ‘స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ గిరిజనులు రోడ్లు, తాగునీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. డోలీలు లేని మన్యం రోడ్లను చూపిస్తాం. గిరిజనులంతా బాగా చదువుకోవాలి. నన్ను పని చేయనివ్వండి. ఎక్కడికెళ్లినా నన్ను చుట్టుముట్టొద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ గిరిజన గ్రామంలోని పరిస్థితులు చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారు. సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒకటే అడిగాను… 70 ఏళ్లుగా ఇక్కడ రోడ్లు లేవు, బాలింతలను డోలీల్లో మోసుకెళ్లే పరిస్థితి ఉందని ఆయనకు వివరించాను అన్నారు. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ మాటిస్తున్నాను… మీకోసం ఎండనకా, వాననకా అహర్నిశలు కష్టపడడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇక, జోరు వానలోనూ పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సాగించారు. గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కాలి నడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించి అధికారులకు ఆదేశాలిచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్ లతో మాట్లాడి గిరిజన ఆవాసాలకి మౌలిక వసతుల కల్పనపై దిశానిర్దేశం చేశారు. మక్కువ మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా ఫోన్‌లో బంధించారు.

ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, సిద్దవటంతోపాటు ఇక్కడ అడ్వంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని.. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియచేయాలని అధికారులకి సూచించారు. శంబర గ్రామంలో శ్రీ పోలమాంబ ఆలయం వద్ద పనికి ఆహార పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్ లో వీడియో తీసుకున్నారు. గతంలో తాను పోరాట యాత్రలో భాగంగా పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రధానంగా మూడు సమస్యలను గుర్తించానని… అవి రోడ్లు, తాగునీరు, యువతకు ఉపాధి అని వివరించారు. ఇక్కడికి రావాలని, ఇక్కడ రోడ్లు వేయాలని ఇప్పటిదాకా ఎవరూ ఆలోచించలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: CM Revanth Open Challenge : తెలంగాణ భవన్ కే వస్తా..దమ్ముందా కేటీఆర్