Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి పవన్ కళ్యాణ్ అమిత్‌షాతో సమావేశమయ్యారు. సహకార శాఖ నుంచి నిధుల కేటాయింపుపై అమిత్ షాతో పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
కాగా, తొలిసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అమిత్‌షాతో భేటికి ముందు మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు తాను ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇకపోతే.. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములను ఇటీవల పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట భూములు ఉన్నాయి. మరో వైపు రాష్ట్రంలో పోలీసు శాఖ సరిగా పని చేయట్లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏయే అంశాలు పవన్ కల్యాణ్ మాట్లాడారో తెలియాల్సి ఉంది. వెలగపూడిలో మంత్రి వర్గ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ఢిల్లీకి బయల్దేరి వచ్చారు.