ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో మరో వివాదం చోటు చేసుకుంది. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్నప్పుడు ఆయన్ను అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముద్రగడ కుటుంబం సున్నితంగా తిరస్కరించింది.
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైసీపీ నేత జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. “ముద్రగడ గారు బతికున్నప్పుడు ఆయన్ను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మరణించాక మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ లాంఛనాలు వద్దని ఆయన కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు” అని రాజా తెలిపారు.
ముద్రగడ అధికారం కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం పోరాడిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. దీంతో, ప్రభుత్వ లాంఛనాలు లేకుండానే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముద్రగడ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
