ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 24వ తేదీ వరకూ SIR (Special Intensive Revision) గడువును పెంచింది. వాస్తవానికి నేటితో (జులై 14) ఎస్ఐఆర్ గడువు ముగియనుంది. అయితే ఎస్ఐఆర్ గడువు పొడిగించాలంటూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జూలై 24వ తేదీ వరకూ ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనుంది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకూ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చింది. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి అభ్యర్థనతో సవరించిన కొత్త షెడ్యూల్‌ను వెల్లడించింది.
మరోవైపు ఏపీలో గత నెల రోజులుగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టగా.. జూలై 13వ తేదీ నాటికి 88 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తైంది. అయితే జూలై 14వ తేదీతో ఎస్ఐఆర్ గడువు పూర్తి కానుండటం.. డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవటంతో గడువును పొడిగించాలంటూ వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈవో లేఖ రాశారు. దీంతో ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ వెల్లడించింది.
మరోవైపు ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 4 కోట్ల 16 లక్షల 26 వేల 144 ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్‌వోలు పంపిణీ చేశారు. సోమవారం వరకూ 3 కోట్ల 69 లక్షల 50 వేల 812 మంది ఓటర్ల వివరాలను, అంటే 88 శాతం మంది వివరాలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 1.67 శాతం ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 14,19,644 మంది ఓటర్లు మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఉపాధి, ఇతర కారణాలతో 12,14,994 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించారు.
అలాగే బీఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లిన సమయంలో.. 7,26,425 మంది ఓటర్లు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో చనిపోయిన ఓటర్ల విషయాన్ని పక్కనబెడితే ఎస్ఐఆర్ ప్రక్రియ ఏపీలో ఇంకా 9 శాతానికి పైగా పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గడువు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.. కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు సమయాన్ని పెంచాలని కోరడంతో ఎన్నికల సంఘం అంగీకరిస్తూ గడువును పొడిగించింది.
