తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ (AP Congress) బలపడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భవిష్యత్తులో దేశానికి ప్రధాని అవుతారని, అందువల్ల ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన ‘స్టాప్ ఓట్ చోరీ’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు, అసమ్మతి లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇటీవల పార్టీలో తలెత్తిన కొన్ని వివాదాలపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని ఆయన అన్నారు.
Heavy Rainfall: ఏపీలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు .. ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ!
తెలంగాణ రాష్ట్రం నీటి హక్కుల కోసం పోరాడి సాధించుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయి, నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశాన్ని ప్రస్తావించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో రాజీ పడబోమని, తమ హక్కులను కాపాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.
‘ఓట్ చోరీ’పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క సమర్థించారు. ఓట్ల సవరణ పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎన్నికల్లో పారదర్శకత చాలా ముఖ్యమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైనదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు.