ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రకాశ్ రాజ్ హిందూ సమాజంపై చేస్తున్న అవమానకర వ్యాఖ్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను అవమానించే చర్యల వెనుక ఆయన ప్రోద్బలం ఉంది” అని ఆరోపించారు.
అంతేకాకుండా, వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్‌కు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ హిందూ సమాజాన్ని అవమానించే ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తున్న వైసీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీలు, ప్రకాశ్ రాజ్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రకాశ్ రాజ్‌తో పాటు ఆయన వెనుక ఉన్న శక్తులపై చట్టపరంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
