Former MLA: ఏపీలో తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే (Former MLA) తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కామెంట్స్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తిరుపతిలో తొక్కిసలాట ఎన్నడూ జరగలేదు. భక్తుల భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టదా? పోలీసులంతా చంద్రబాబు పర్యటనలో నిమగ్నం అయ్యారు. భక్తుల భద్రతను చంద్రబాబు సర్కార్ గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికార యంత్రాంగంపై పట్టులేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ పదుల సంఖ్యలో హిందువులు మృతి చెందుతున్నారు. సనాతన ధర్మం ప్రతినిధి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు బాధ్యత వహించరు? పవన్ కళ్యాణ్ క్షమాపణలతో పోయిన ప్రాణాలు వస్తాయా? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో తొక్కిసలాట ఘటనలు జరగలేదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి. దేవాదాయ శాఖ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి. పవన్ కళ్యాణ్ పదేపదే మొసలి కన్నీరు కారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ మగాడివైతే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. పోలీసు బలగాలన్నీ కుప్పం ముఖ్యమంత్రి పర్యటనకు, బాలకృష్ణ డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెళ్లాయి. తిరుపతికి వచ్చే భక్తుల భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Pocso Case : చెవిరెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేత
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్
తిరుపతి తొక్కిసలాట ఘటన నేపాన్ని వైసీపీపై నెట్టే కుట్ర చేస్తున్నారని మాజీ ఎంపీ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. తిరుపతి తొక్కిసలాట ఘటనను టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు తప్పిదాన్ని వెంకటేశ్వర స్వామిపై నెట్టారు. తొక్కిసలాట దైవ నిర్ణయం అన్న బిఆర్ నాయుడు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అయితే తిరుమల వెంకటేశ్వర స్వామిపై కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. హైందవ సమాజం తిరుపతి తొక్కిసలాటను గమనించాలి. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వర్గానికి వెళ్లాలనుకున్న భక్తులను తొక్కిసలాటతో చంపి ఈ ప్రభుత్వం నరకానికి పంపించింది. టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలుకు బదులు… డెత్ సిక్స్ అమలు చేశారు. తప్పు జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి. టీటీడీ వ్యవహారాల్లో పోలీసుల పాత్ర నామమాత్రం. పోలీసులను బలి పశువు చేయొద్దు. ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు.