Site icon HashtagU Telugu

Jagan Reaction: ప‌వ‌న్ కు జ‌గ‌న్ కౌంట‌ర్! మూడు పెళ్లిళ్ల గోల‌!!

Jagan And Pawan

Jagan And Pawan

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సున్నితంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ ను మందలించారు. ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌పై మ‌రోసారి జగన్ మోహన్ రెడ్డి చుర‌క‌లంటించారు. అంతేకాదు, మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ వేదిక‌గా ప‌వ‌న్ వినిపించిన బూతు పురాణం గురించి జగన్ మోహన్ రెడ్డి ప్ర‌స్తావించారు. అవ‌నిగ‌డ్డ‌లో జ‌రిగిన బ‌హిరంగ సభ‌లో సీఎం ఇచ్చిన స్పీచ్ అంతా ప‌వ‌న్ కు చుర‌క‌లు వేసేలా సాగింది.

వైజాగ్ ఘ‌ట‌న నుంచి మంగ‌ళగిరి ఆఫీస్ వేదిక‌గా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరును జగన్ మోహన్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. వీధి రౌడీలు కంటే మిన్న‌గా ప‌వ‌న్ వాడిన భాష‌ను ఆయ‌న ప్రస్తావించారు. హిందూ సంప్ర‌దాయంలో పెళ్లికి ఉన్న విలువ‌ను త‌గ్గిస్తూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. స‌మాజంలోని మ‌హిళ‌ల‌కు అభ‌ద్ర‌తాభావం క‌లిగించేలా ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని చుర‌క‌లంటించారు.

Also Read:   Pawan Kalyan: ఢిల్లీ వ్యూహంలో ప‌వ‌న్ ఢ‌మాల్

ఎవరికీ అన్యాయం జరగకుండా అభివృద్ధి చేసుకుందామని మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివ‌రించారు. అయితే, కొంతమంది నేతలు మూడు రాజధానులతో కాదు మూడు పెళ్లిళ్లతో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారని పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఏకంగా టీవీల ముందుకొచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెప్తున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాషలో తిడుతున్నారని విమ‌ర్శించారు. ఇలాంటి వాళ్లా? మన నాయకులని విరక్తి కలుగుతున్నట్లు జగన్ చెప్పారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లాడరని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కరూ మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల మంగళగిరి ఆఫీస్ వేదిక‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై స్పందించిన విషయం తెలిసిందే. పదేపదే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు..మీరు కూడా చేసుకోండని పవన్ సూచించారు. మొదటి భార్యకు ఐదు కోట్లు ఇచ్చి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నాన‌ని , విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నాను తప్ప కొంతమంది నేతల లాగా ఒక్క పెళ్లి చేసుకుని, ముప్పై మంది స్టెఫినీలతో తిరగలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై అవ‌నిగ‌డ్డ వేదిక‌గా జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టుప‌ట్టించేలా ప‌వ‌న్ మాట‌లు ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. ఇలాంటి వాళ్లు ద‌శ దిశ సమాజానికి ఎలా చూపిస్తార‌ని ప్ర‌శ్నించారు.

Also Read:    Amaravati Politics: అమ‌రావ‌తిపై `మూడు` సంచ‌ల‌నాలు