YSRCP : సొంత‌పార్టీ నేత‌ల‌పై సీఎం జ‌గ‌న్ నిఘా..? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై అధికార పార్టీలో టెన్ష‌న్‌

ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టెన్ష‌న్ ఇంకా కొనసాగుతుంది. తాజాగా మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను టీడీపీ

  • Written By:
  • Updated On - March 20, 2023 / 08:37 AM IST

ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టెన్ష‌న్ ఇంకా కొనసాగుతుంది. తాజాగా మూడు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను టీడీపీ గెలుచుకోవ‌డం వైసీపీలో టెన్ష‌న్ పుట్టిస్తుంది. ఈ నెల 23 న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా నామినేష‌న్ వేయ‌డంతో వైసీపీలో మ‌రింత టెన్ష‌న్ పెరిగింది. ఈ నేప‌స‌థ్యంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ముఖ్యమంత్రి జగన్‌ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పలు జిల్లాల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు మఫ్టీలో అనుసరిస్తున్నట్లు సమాచారం. నిఘా వర్గాలు సైతం వారి కదలికలు, మాటామంతీపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారేమోనన్న భయమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎన్నికలు ఈ నెల 23న జరుగనున్నాయి. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తేనే విజయం వరిస్తుంది.

వైసీపీ ఏడు స్థానాలకూ అభ్యర్థులను నిలిపింది. 22 మంది ఎమ్మెల్యేల చొప్పున 154 ఓట్లు పడితేనే అందరూ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 151 మాత్రమే. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు(వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం) ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. జనసేన ఏకైక సభ్యుడు రాపాక వరప్రసాద్‌ సైతం వైసీపీతోనే ఉండడంతో తమ పార్టీ అభ్యర్థులు ఏడుగురూ గెలుస్తారని వైసీపీ ధీమాగా ఉంది. అయితే అనూహ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ తరఫున బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను పోటీకి దించారు. అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఎందుకు పోటీ చేయకూడదని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు దూరమైనా ఏ ధీమాతో చంద్రబాబు తమ అభ్యర్థిని నిలబెట్టారా అని ప్రభుత్వ పెద్దలు ఆరా తీశారు.

సీఎంకు తన పార్టీ ఎమ్మెల్యేలపై అనుమానాలు మొదలయ్యాయని ప్ర‌తిప‌క్షాల్లో టాక్ వినిపిస్తుంది. అటు నుంచి నలుగురు తమవైపు వచ్చినట్లే.. ఇటు నుంచి ఎవరైనా టీడీపీకి ఓటేస్తారేమోనని భయం పట్టుకున్నట్లు అధికార పార్టీలో కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారనే నమ్మకం లేదు. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని వీరు ఇప్పటికే ప్రకటించారు. టీడీపీ అభ్యర్థికి ఆ ఇద్దరూ ఓటేస్తే ప్రతిపక్షం బలం 21కి చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపుతో ఊపుమీదున్న సైకిల్‌ వైపు వైసీపీ ఎమ్మెల్యేలెవరైనా మొగ్గితే.. వైసీపీ అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోతారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వరని.. ఈ నాలుగేళ్లలో సీఎం తమకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నట్లు వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది.

ఆనం, కోటంరెడ్డి కాకుండా నెల్లూరు జిల్లాలో మరో ఎమ్మెల్యే అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి ఓటేస్తారో లేదోనని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. దీంతో వారిపై పోలీసులతోపాటు పార్టీ శ్రేణులతోనూ నిఘా పెట్టారు. నిఘా వర్గాలు సైతం వారి కదలికలపై నిరంతరం ఆరా తీస్తున్నట్లు సమాచారం. టీడీపీలో గెలిచి వైసీపీతో సఖ్యతగా ఉన్న ఒక ఎమ్మెల్యే సైతం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన్ను కూడా ఓ కంట కనిపెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే 23వ తేదీన జరిగే ఓటింగ్‌కు హాజరు కావాలని వైసీపీ నాయకత్వం పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది. ఇప్పటికే ఒక్కో అభ్యర్థికి ఓటేయాల్సిన 22 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసింది. వారికి అవగాహన కోసం మాక్‌ ఓటింగ్‌నూ నిర్వహించింది.