ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu ) అభివృద్ధి లక్ష్యంగా సింగపూర్( Singapore)ను ఆదర్శంగా తీసుకుంటారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నూతన రాజధాని అమరావతికి రూపురేఖలు సిద్ధం చేసేందుకు సింగపూర్ సాయం తీసుకోవడమే కాదు, ఆ దేశంతో పలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు రెండో సారి బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి విదేశీ పర్యటనగా జూలై 26 నుంచి 30 వరకు ఐదు రోజులపాటు సింగపూర్ పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భారత్, ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, పరిశ్రమల కార్యదర్శి యువరాజ్ తదితర అధికారులు పాల్గొననున్నారు.
ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం పెట్టుబడులను ఆకర్షించడం. సింగపూర్‌తో భాగస్వామ్యంగా పలు రంగాల్లో సహకారం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక, ఓడరేవులు, లాజిస్టిక్స్, మౌలిక వసతుల అభివృద్ధి, నగరాల సుందరీకరణ, స్టార్టప్ రంగాల్లో సహకారం కోరుతున్నారు. చంద్రబాబు బృందం అక్కడి రాజకీయ, వాణిజ్య, సాంకేతిక ప్రతినిధులతో సమావేశాలు జరిపి సానుకూలతను కలిగించేందుకు ప్రయత్నించనున్నారు. ఇక అమరావతిలో సాగుతున్న పనులపై నమ్మకాన్ని కల్పించి, కొత్తగా పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
Nipah Virus: దేశంలో నిపా వైరస్ కలకలం.. 1998 నుంచి భారత్‌ను వదలని మహమ్మారి!
గతంలో సింగపూర్ కన్సార్టియంతో అమరావతికి సంబంధించిన భారీ ఒప్పందాలు జరిగినా, 2019లో జగన్ ప్రభుత్వ కాలంలో అవి రద్దయ్యాయి. సింగపూర్ నుంచి వచ్చిన Ascendas-Singbridge, Sembcorp సంస్థలతో కలిసి 1691 ఎకరాల్లో అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధికి నూతన ప్రయోగం మొదలుపెట్టారు. కానీ, వైసీపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేస్తూ ఒప్పందాన్ని రద్దు చేయడంతో సింగపూర్ లింక్ తెగిపోయింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సింగపూర్‌తో పాత బంధాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ఆయన మరింత జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తున్నారు.
ఇప్పటికే అమరావతిలో రూ.33,000 కోట్ల పెట్టుబడులు సమీకరించి, పనులను తిరిగి ప్రారంభించారు. రైల్వే ప్రాజెక్టులు, అవుటర్ రింగ్ రోడ్, క్వాంటమ్ వ్యాలీ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం పొందారు. ఈ క్రమంలో ఇప్పుడు సింగపూర్ పర్యటనకు వెళుతున్న చంద్రబాబు, పాత ఒప్పందాలను పునరుద్ధరించాలా? లేక కొత్తగా సర్‌ప్రైజ్ ఒప్పందాలు తీసుకురావాలా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అమరావతికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక మద్దతును తిరిగి పొందేందుకు చంద్రబాబు ఈ పర్యటనలో ఎలా సక్సెస్ అవుతారు అనే దానిపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది.