Site icon HashtagU Telugu

Fengal Cyclone: ఫెంగల్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కీల‌క ఆదేశాలు!

Fengal Cyclone

Fengal Cyclone

Fengal Cyclone: ఫెంగ‌ల్ తుఫాన్‌పై (Fengal Cyclone) సీఎం చంద్ర‌బాబు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు అధికారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాల‌ని ఆదేశించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు.

తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. తుఫాన్‌పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచ‌న‌లు చేశారు.

Also Read: Amaran Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా శివ కార్తికేయన్, సాయి పల్లవి అమరన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తిరుమ‌ల‌లో వ‌ర్షం

పెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వర్షం కురుస్తోంది. గ‌త‌ రాత్రి నుండి ఆగ‌కుండా వ‌ర్షం కురుస్తుంది. అంతేకాకుండా తుఫాన్ కార‌ణంగా ఈదురుగాలులు బ‌లంగా వీస్తున్నాయి. తిరుమలంతట దట్టంగా మంచు కమ్మేసింది. దీంతో తిరుమ‌ల‌లో చలి తీవ్రత పెరిగింది. అదేవిధంగా భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచన‌లు చేసింది. ఘాట్ రోడ్డులో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తమైంది.

కాసిమేడు సముద్రం ఉప్పొంగింది

ఫెంగల్ తుఫాన్ ప్రవాహానికి ఆరడుగుల ఎత్తులో సముద్రపు అల దూకుడుగా ఎగసిపడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ‌నివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుఫాన్‌గా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘ఫెంగ‌ల్’ అని పేరు పెట్టారు. నాగై నుండి 260 కి.మీ, పుదుచ్చేరి నుండి 270 కి.మీ, చెన్నైకి 300 కి.మీ దూరంలో ఉంది. ఈ తుఫాన్‌ ప్రస్తుతం గంటకు 13 కి.మీ. వేగంగా కదులుతోంది. ఈ రోజు (నవంబర్ 30) మధ్యాహ్నం కారైకల్, మామల్లపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫాను తీరం దాటుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై కాసిమేడు మీన్ తాండిగ్రై, ఎన్నూర్ తిరువొత్తియూర్ సహా సముద్ర ప్రాంతంలో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. అలల కారణంగా దాదాపు 6 అడుగుల ఎత్తుకు ఎగసిప‌డుతున్నాయి.