CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీచర్ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన అన్నారు. వచ్చే ఏడాది స్కూళ్లు ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దీపం 2 పథకం ద్వారా దాదాపు 40 లక్షల మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. వచ్చే సంక్రాంతి వరకు రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తామని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఎక్కువ పింఛన్ ఇస్తున్న రాష్ట్రంగా ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లు సగం కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
మరోవైపు మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్ నిర్వహించిన ప్రభుత్వం విద్యార్దుల విషయంలో మరో మార్పు చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఇచ్చిన జగనన్న కిట్ పేరు మార్పు చేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ గా అమలు చేస్తోంది. ఇప్పుడు ఆ కిట్ లో గతంలో యూనిఫాం తో సహా అన్నింటి రంగులను మార్పు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలు కానున్నాయి. ఇప్పటి వరకు విద్యార్ధులకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న యూనిఫాం రంగులు ఇక లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడుల చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంటుగా ఇవ్వనున్నారు.
కాగా, ఇప్పుడు మార్పులో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ బొమ్మతో కూడిన లోగో తో పంపిణీ చేయనున్నారు. బ్యాగులు సైతం లేత ఆకుపచ్చ రంగులో ఉండేలా డిజైన్ చేసారు. ప్రభుత్వం ఖరారు చేసిన ఈ రంగులతో విద్యార్ధులకు కిట్ లుగా అందించేందుకు టెండర్లను ఆహ్వానిస్తున్నారు. జూన్ 12, 2025 న విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి వీటిని సిద్దం చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అదేశించింది.