Site icon HashtagU Telugu

CM Chandrababu: పింఛన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ.. మాట ఇచ్చా.. అమలు చేస్తా..!

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పింఛన్‌దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘మీకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్‌ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తాం.’ అని లేఖలో సీఎం పేర్కొన్నారు.

సీఎం చంద్ర‌బాబు లేఖ‌లో ఏం రాశారంటే.. ప్రియమైన పింఛనుదారులకు నమస్కారం. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యంగా మీ ఈ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మ్యానిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి రూ. 1000 పెంచి.. ఇకపై రూ.4000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు రూ.3000 పెంచి.. ఇక నుంచి రూ.6000 ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను.

Also Read: DS Formal Rites: రేపు నిజామాబాద్‌లో అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు..!

28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్దిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాం. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ… మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా.. మీ శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చాం. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చలించిపోయాను.

We’re now on WhatsApp : Click to Join

మండుటెండలో, వడగాడ్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి… ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింప చేసి మీకు అందిస్తున్నాము. మూడు నెలలకు పెంచిన రూ.3000, జూలై నెల పింఛన్ రూ.4000 కలిపి మొత్తం రూ.7000 మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టాము. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము. మీ భద్రత మా బాధ్యత. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడూ మంచి చేయాలని చూసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతూ మీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Exit mobile version