Site icon HashtagU Telugu

CM Chandrababu : గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలం: సీఎం చంద్రబాబు

cm chandrababu visited flood affected areas

cm chandrababu visited flood affected areas

CM Chandrababu speech at Eluru: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

ఆ పడవలు వదిలింది వారే..

గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ”వరదలు ఎక్కువ రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు. వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి.. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలే ఎక్కువ నష్టపోతారు. మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు వద్ద 5 రోజులు ఉండి గండ్లు పూడ్చారు కాబట్టే విజయవాడకు వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు వదిలింది వైసీపీకి చెందిన వారే. పడవలు వదిలిపెట్టి తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. అక్కడికి వచ్చింది అక్రమ ఇసుక వ్యాపారం చేసిన పడవలే.

దుర్మార్గ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయి..

నేరాలు చేసే వ్యక్తులు.. ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వం మొత్తం దోచేసింది. అప్పులు మిగిల్చారు.. వాటిని భర్తీ చేస్తున్నాం. ఖాళీ ఖజానాతో అభివృద్ధి ఆగిపోయింది. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు.. అయినా నెట్టుకుంటూ వస్తున్నాం. కృష్ణా నదికి ఊహించని విధంగా వరద వచ్చింది. గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలమైంది. దీంతో బుడమేరుకు గండ్లు పడ్డాయి. టీడీపీ హయాంలో మంజూరు చేసిన నిధులనూ పక్కన పెట్టారు. ఎక్కడా ఒక డ్రెయిన్, కాలువ తవ్విన పాపాన పోలేదు. గత ఐదేళ్ల దుర్మార్గ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయి. పనిచేసే వ్యక్తులు పనిచేయడం మానేశారు. విజయవాడలో సాధారణ పరిస్థితులు రావడానికి 10 రోజులు పట్టింది. బుడమేరు గండ్లు పూడ్చటానికి ఒక యుద్ధమే చేశాం. ఆర్మీ వాళ్లే మావల్ల కాదని చేతులెత్తేశారు. మా మంత్రులు దగ్గరుండి గండ్లు పూడ్పించారు. ఎవరైనా బోట్లను జాగ్రత్తగా ఉంచుకుంటారు. ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి. అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు. ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నారు. నేరాలు చేసే వారు ప్రజా జీవితంలో ఉంటే ఇలానే ఉంటుంది. నేరస్థులు రాజకీయ ముసుగు వేసుకున్నారు” అని చంద్రబాబు విమర్శించారు.

Read Also: Walnut Benefits: నానబెట్టిన వాల్ నట్స్ తింటే ఈ సమస్యలు దూరం..!