CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) ఈనెల 17వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన మహిళా, శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు, ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11:15 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
అనంతరం ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్‌లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ క్యాంప్‌లో మహిళలు, పిల్లల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందిస్తారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12 గంటలకు “స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంపై ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మహిళలు, కుటుంబాల సాధికారతకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరించే అవకాశం ఉంది.
Also Read: Panchmukhi Hanuman Ji: మంగళవారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి పూజ చేయండిలా!
ఆ తర్వాత ముఖ్యమంత్రి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొంటారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ ద్వారా విశాఖను గ్లోబల్ సెంటర్‌గా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి వివరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖ నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలన్నింటిలోనూ భద్రతను పటిష్టం చేశారు. ఈ పర్యటన విశాఖ అభివృద్ధికి, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగాల బలోపేతానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.