ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన పూర్తిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఏపీలో మౌలిక వసతులు, టెక్నాలజీ, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఇటీవలే గూగుల్, అడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంపై ఆసక్తి చూపిన నేపథ్యంలో లండన్ పర్యటన ద్వారా ఆ ఉత్సాహాన్ని మరింతగా పెంచాలనే లక్ష్యంతో సీఎం బయలుదేరుతున్నారు.
Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?
లండన్ పర్యటనలో చంద్రబాబు పలు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ సదస్సుకు రావాలని ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్తలను స్వయంగా ఆహ్వానించనున్నారు. ఈ సదస్సులో దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొని ఏపీ పెట్టుబడి అవకాశాలను పరిశీలించనున్నాయి. పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, వేగవంతమైన అనుమతుల విధానం, విశాఖ–అమరావతి–తిరుపతి లాజిస్టిక్ కనెక్టివిటీ వంటి అంశాలను చంద్రబాబు ఈ సమావేశాల్లో ప్రాధాన్యంగా ప్రస్తావించనున్నారు.
ఇక ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టాలనే సీఎం సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కూడా ఆయన విదేశీ పర్యటనల ద్వారా అనేక ప్రాజెక్టులు, మౌలిక వసతుల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చిన అనుభవం ఉంది. లండన్ ట్రిప్ కూడా అదే దిశగా మరో ముందడుగుగా భావిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే అభివృద్ధి సాధ్యం కాదన్న ఆలోచనతో, గ్లోబల్ బిజినెస్ వేదికలపై ఏపీ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడమే చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.